జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం అక్టోబర్ 28. 10. 2026 సంగారెడ్డి జిల్లాప్రజలంతా రాబోయే మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనులు చేపట్టే సమయంలో వాతావరణ పరిస్థితులను గమనించాలని, పొలాల్లో పని చేసే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున వాటి సమీపంలోకి వెళ్లకూడదని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని తెలిపారు. విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షాల వల్ల పంటలకు నష్టం వాటిల్లకుండా రైతులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారుల నుంచి వెలువడే వాతావరణ హెచ్చరికలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని చిట్టెంపల్లి బాలరాజ్ విజ్ఞప్తి చేశారు.