అధికారులకు ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజా క్షేమంపై కూడా చూపాలి: అయ్యాజీ వేమా

June 9, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూన్ 9 ముమ్మిడివరం ప్రతినిధి మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరు తున్నప్పటికీ, మద్యం సీసాల వ్యర్థాల నిర్వహణలో సంబంధిత శాఖలు నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రజలు, రైతులు, ఉపాధి హామీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా అన్నారు.డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కి సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం” కార్యక్రమంలో ఆయన వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వేమా మాట్లాడుతూ, కోనసీమ జిల్లాలో మద్యం సేవించిన అనంతరం ఖాళీ గాజు సీసాలను రోడ్ల పక్కన, పంట కాలువల్లో, పొలాల గట్లపై, ప్రజలు సంచరించే ప్రాంతాల్లో విచ్చలవిడిగా పడవేయడం, పగులగొట్టడం వల్ల ప్రజారోగ్యానికి, ప్రజల భద్రతకు, వ్యవసాయ కార్యకలాపాలకు ముప్పు ఏర్పడుతోందన్నారు. పగిలిన గాజు పెంకుల కారణంగా రైతులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు గాయపడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే మద్యం విక్రయాల విషయంలో చూపుతున్న శ్రద్ధ, వాటి వల్ల ఏర్పడుతున్న సామాజిక మరియు పర్యావరణ సమస్యల పరిష్కారంపైనా ఉండాలని ఆయన సూచించారు.ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయ కేంద్రాలలో వయోపరిమితి నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పాటు, ఖాళీ సీసాలను తిరిగి సేకరించే “బాటిల్ రిటర్న్ సిస్టమ్” ప్రవేశపెట్టాలని కోరారు. అలాగే సీసాలు తిరిగి ఇచ్చిన వారికి ప్రోత్సాహకాలు కల్పించే విధానాన్ని పరిశీలించాలని సూచించారు.ఇరిగేషన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మున్సిపల్ శాఖలు సమన్వయంతో కాలువలు, రహదారులు, ప్రజా ప్రదేశాల్లో పడివున్న గాజు వ్యర్థాలను తొలగించే ప్రత్యేక చర్యలు చేపట్టాలని, హెచ్చరిక బోర్డులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని కూడా కోరారు. వినతి పత్రంలో పేర్కొన్న అంశాలపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి, సంబంధిత శాఖలతో సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వేమా తెలిపారు.ఈ కార్యక్రమంలో గువ్వల నాగరాజు, రక్కాల సత్తిబాబు, చీకరమెల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper