వివేకానంద నగర్‌లో మిగిలిన సర్వీస్ రోడ్డు పనులు త్వరలో ప్రారంభం చేయాలి: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
జనం న్యూస్ మే 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : శేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ వివేకానంద నగర్ మెయిన్ రోడ్డులో మిగిలిపోయిన సర్వీస్ రోడ్డు పనులను పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్డు పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు మధ్యలో ఉన్న మూడు విద్యుత్ స్తంభాల కారణంగా పనులు ఆలస్యమవు తున్నాయని గుర్తించిన ఎమ్మెల్యే, వాటిని వెంటనే తొలగించేలా సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని సూచించారు. సీసీ రోడ్డు నిర్మాణాన్ని వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఎమ్మెల్యే మాట్లాడి ప్రాంత అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎన్. శ్రీనివాసరావు, కాలనీ అధ్యక్షుడు రామకృష్ణ, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనంపల్లి పురేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు జి. నర్సింగ్‌రావు, శ్రీధర్, జి. ప్రసాద్, కృష్ణరాజు, నాయకులు సంజీవరెడ్డి, ఎం.డి. ఇబ్రహీం, మల్లయ్య, శివసాగర్ తదితరులు పాల్గొన్నారు. స్థానికులు కూడా ఎమ్మెల్యే చొరవను అభినందిస్తూ, మిగిలిన రోడ్డు పనులు త్వరగా పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.