పాఠశాల బస్సుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి:
జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్.
జనం న్యూస్ 16 జూన్ వికారాబాద్ జిల్లా :విద్యార్థుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, స్కూల్ బస్సుల నిర్వహణ, డ్రైవర్ల అర్హతలు, వాహనాల ఫిట్‌నెస్ విషయంలో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు,సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ సూచించారు.మోటారు వాహనాల చట్టం ప్రకారం స్కూల్ బస్సులకు చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, పర్మిట్‌లతో పాటు బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వంటి భద్రతా సదుపాయాలు ఖచ్చితంగా ఉండాలని ఆదేశించారు.వాహనాలు నడిపే డ్రైవర్లు తగిన అనుభవం, లైసెన్స్ కలిగి ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు పాల్పడకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.తల్లిదండ్రులు కూడా బస్సుల పరిస్థితిని, డ్రైవర్ల ప్రవర్తనను గమనిస్తూ, ఏవైనా లోపాలు ఉంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలు, డ్రైవర్లపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.