సిఎంసీ రికార్డుల్లో ఇళ్లు… వాస్తవానికి కమర్షియల్ కేంద్రాలు!కైతలాపూర్ 15వ ఫేజ్ లో అక్రమ నిర్మాణాలపై స్థానికుల ఆందోళన
జనం న్యూస్ జులై 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కైతలాపూర్ 15వ ఫేజ్‌లో నివాస ప్రాంతాలు క్రమంగా వాణిజ్య కేంద్రాలుగా మారుతున్నాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. సిఎంసీ రికార్డుల్లో ఇప్పటికీ నివాస గృహాలుగానే నమోదై ఉన్న అనేక భవనాలు, వాస్తవానికి వాణిజ్య అవసరాలకు వినియోగంలో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అధిక అద్దె ఆదాయం కోసం పలువురు భవన యజమానులు గృహ నిర్మాణాలకు తీసుకున్న అనుమతులతోనే గుట్టు చప్పుడు కాకుండా భవనాలను కమర్షియల్ వినియోగానికి మార్చి అద్దెలకు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సిఎంసీ కి రావాల్సిన కమర్షియల్ ఆస్తి పన్నులు భారీగా తగ్గిపోతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.నిబంధనల ప్రకారం నివాస భవనాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించాలంటే సంబంధిత అధికారుల నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకుని కమర్షియల్ పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అదనపు పన్ను భారం తప్పించుకోవాలనే ఉద్దేశంతో గృహ అనుమతులనే ఆధారంగా చేసుకుని అనేక వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయని విమర్శలు వ్యక్తమవు తున్నాయి. ఈ వ్యవహారం సంబంధిత సిఎంసీ అధికారులకు తెలియకుండా జరుగుతుందా? లేక వారి కనుసన్నల్లోనే సాగుతోందా? అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. కొందరు యజమానులు సంబంధిత సిబ్బందితో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.ముఖ్యంగా కైతలాపూర్ 15వ ఫేజ్‌లో ఖాళీ స్థలాల్లో భారీ షెడ్లు నిర్మించి అద్దెలకు ఇవ్వడం, ప్లాట్లను కమర్షియల్ వినియోగానికి మార్చి వరుసగా షట్టర్లు నిర్మించడం సాధారణంగా మారిందని కాలనీవాసులు చెబుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో నివాస ప్రాంత స్వరూపమే మారిపోతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఖాళీ స్థలాలను అద్దెకు తీసుకున్న నిర్వాహకులు ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించి భారీ షెడ్లు నిర్మించి ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నారని, దీంతో ట్రాఫిక్, పార్కింగ్, కాలుష్యం, భద్రత వంటి సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.ఇప్పటికైనా సిఎంసీ ఉన్నతాధి కారులు స్పందించి అక్రమ షెడ్లు, అనుమతి లేని కమర్షియల్ నిర్మాణాలపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే నివాస ప్రాంతాలు పూర్తిగా వాణిజ్య కేంద్రాలుగా మారిపోయి భవిష్యత్తులో మరిన్ని సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు