మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియని మరియు మోడల్ స్కూల్ హాస్టల్ లో ఆహారాన్ని పరిశీలించిన తహసీల్దార్ వరప్రసాద్
ఓటరు నమోదు ఫారాల స్వీకరణలో సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి – పాఠశాల మధ్యాహ్న భోజన పథకం తనిఖీ, ఉపాధ్యాయ సంఘం వినతిపత్రం స్వీకరణ
జనం న్యూస్, జూలై 5, ఇబ్రహీంపట్నం మండలం:ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్దండి గ్రామంలో శనివారం తహసీల్దార్ బీఎస్ఎస్ వరప్రసాద్ ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పరిశీలించారు. జూన్ 30తో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తికావడంతో, జూలై 1 నుంచి ఓటర్లు నింపిన ఫారాలను బీఎల్ఓలకు అందజేసే ప్రక్రియను ఆయన పరిశీలించారు.ఈ నెల 24వ తేదీ వరకు ఓటరు వివరాలు నింపిన ఫారాలను బీఎల్ఓలు స్వీకరిస్తారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామస్తులు తమ వంతు సహకారం అందించాలని తహసీల్దార్ కోరారు. భూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు) ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించాలని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిబంధనల ప్రకారం కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని సూచించారు.అనంతరం ఎర్దండి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యత, వివరాలను తెలుసుకున్నారు. ఎండీఎం ఏజెన్సీ సిబ్బంది ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని తయారు చేసి అందించాలని ఆదేశించారు.ఇక తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) హైదరాబాద్ పిలుపు మేరకు ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన సుమారు 25 మంది సంఘ ప్రతినిధులు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. విద్యారంగ సమస్యల పరిష్కారం, పీఆర్సీ అమలు, ఆరు డీఏల చెల్లింపు, పెండింగ్ బిల్లుల విడుదల తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బీఎస్ఎస్ వరప్రసాద్, నాయబ్ తహసీల్దార్ కే. ప్రసాద్, ఆర్ఐలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.