ప్రజా దర్బార్లో అర్జీలు స్వీకరించిన మంత్రి వాసంశెట్టి సుభాష్
జనం న్యూస్ ఆగస్టు 14: ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వేగవంతంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలను స్వీకరించారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 46 అర్జీలు అందాయి. వాటిలో రేషన్ కార్డుల మంజూరు, కొత్త పింఛన్ల మంజూరు, ఇళ్ల స్థలాల కేటాయింపు, రహదారుల నిర్మాణం, డ్రైనేజీ సమస్యలు, విద్యుత్ సౌకర్యాలు, తాగునీటి సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించిన వినతులు ఉన్నాయి.ప్రతి అర్జీని మంత్రి సుభాష్ స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారి గడపకే పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం లభిస్తోందని, అందిన ప్రతి అర్జీపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు చేపడుతుందని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అర్జీదారులు పాల్గొన్నారు.