జీవో నెం.97ను వెంటనే రద్దు చేయాలి – అర్జున్ సాతర్ల.
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ ఆగస్టు 20-08-2026 గురువారం తెలంగాణలో 70 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) పెబ్బేరు శాఖ ఆధ్వర్యంలో నేతాజీ చౌరస్తా లో ధర్నా చేయడం జరిగింది.ఈ సందర్భంగా ABVP పాలమూరు విభాగ్ కన్వీనర్ అర్జున్ సాతర్ల మాట్లాడుతూ, పాలిటెక్నిక్ కళాశాలలను ‘శక్తి స్కీమ్’ (Young India Skills University) పరిధిలోకి తీసుకురావాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే పునఃపరిశీలించాలని, దీనికి సంబంధించిన జీవో నెం. 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.పాలిటెక్నిక్ విద్య కేవలం స్కిల్ ట్రైనింగ్ వ్యవస్థ కాదని, పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నిపుణులను తయారు చేసే ప్రత్యేక సాంకేతిక విద్యా వ్యవస్థ అని అన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్యను అందించడంలో పాలిటెక్నిక్ కళాశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. పాలిటెక్నిక్‌లను విలీనం చేయడం లేదా నిర్వీర్యం చేయడం కాకుండా ఆధునిక ల్యాబ్‌లు, పరికరాలు, మౌలిక వసతులు, బోధనా సిబ్బంది, పరిశ్రమల ఆధారిత శిక్షణ కోసం ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. డిప్లొమా విద్యార్థులకు ఉన్నత విద్యలో కొనసాగేందుకు లభించే లాటరల్ ఎంట్రీ అవకాశాలను మరింత బలోపేతం చేయాలని కోరారు.విద్యా వ్యవస్థలో ఇలాంటి కీలక మార్పులు తీసుకురావడానికి ముందు విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగ సంఘాలు, సాంకేతిక విద్యా నిపుణులతో ప్రభుత్వం విస్తృతంగా చర్చించాలని అర్జున్ సాతర్ల అన్నారు.“పాలిటెక్నిక్ విద్య పేద విద్యార్థుల ఇంజనీరింగ్ కలలకు బలమైన పునాది. ఈ వ్యవస్థను బలహీనపరిస్తే వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. జీవో నెం. 97ను వెంటనే రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యను సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలి” అని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కన్వీనర్ దేవర్ల కార్తీక్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివకుమార్,నగర కార్యదర్శి శివ,అరవింద్, సాయి,మహేష్,వినీల్ తో పాటు పెద్ద సంఖ్యలో పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు.