నూతన చేపల మార్కెట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్

August 25, 2026 | తెలంగాణ

జనం న్యూస్, ఆగష్టు 25,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంఅచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలోని మెయిన్‌ రోడ్డులో నూతన చేపల మార్కెట్ నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ, ఎంపీడీవో తదితర శాఖల అధికారులు ప్రతిపాదిత స్థలాన్ని ఎమ్మెల్యేకి చూపించి, చేపల మార్కెట్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.సుమారు రూ. కోటి అంచనా వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో పూడిమడకలో నూతన చేపల మార్కెట్‌ను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు ఎమ్మెల్యేకి వివరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేపల వ్యాపారులు, మత్స్యకారులు, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందేలా మార్కెట్ నిర్మాణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన అన్ని శాఖల సమన్వయంతో పనులు ముందుకు తీసుకెళ్లి, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.నూతన చేపల మార్కెట్ నిర్మాణం పూర్తయితే పూడిమడకతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు, చేపల వ్యాపారులకు ఆధునిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. చేపల విక్రయాలు మరింత పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా జరిగేందుకు అవకాశం కలగనుంది అన్నారు…ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper