ఆర్టీసీ చార్జీల పెంపుపై ప్రయాణికుల ఆగ్రహం
స్పెషల్ బస్’ పేరుతో రూ.20 అదనపు వసూళ్లు.. అధికారుల వివరణ కోరిన కాంగ్రెస్ సేవాదళ్
జనం న్యూస్ ఆగష్టు 31, జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి: మెట్‌పల్లి నుంచి జగిత్యాల వెళ్లే ఆర్టీసీ బస్సు ప్రయాణ చార్జీ ఒక్కసారిగా పెరగడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు రూ.60గా ఉన్న టికెట్ ధరను సోమవారం రూ.80గా వసూలు చేయడంపై ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చార్జీ పెంపుపై ప్రశ్నించగా ఇది ‘స్పెషల్ బస్’ అని సిబ్బంది చెప్పినట్లు ప్రయాణికులు తెలిపారు.సోమవారం ఉదయం కాంగ్రెస్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి అందే మారుతి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా, తోటి ప్రయాణికులు టికెట్ చార్జీ పెంపు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. నిన్నటి వరకు రూ.60 ఉన్న టికెట్‌ను ఒక్కసారిగా రూ.80కి ఎలా పెంచారని వారు ప్రశ్నించారు.చార్జీల పెంపుపై ప్రభుత్వం లేదా ఆర్టీసీ నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా రూ.20 అదనంగా వసూలు చేయడం వల్ల రోజువారీ ప్రయాణికులపై ఆర్థిక భారం పడుతోందని వారు పేర్కొన్నారు.మెట్‌పల్లి–జగిత్యాల మధ్య ప్రతిరోజూ రాకపోకలు సాగించే ఉద్యోగులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, కార్మికులు, ఇతర సాధారణ ప్రయాణికులు ఈ అదనపు చార్జీతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.అధికారిక వివరణ ఇవ్వాలిటికెట్ చార్జీల పెంపుపై మెట్‌పల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ స్పష్టమైన వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి అందే మారుతి డిమాండ్ చేశారు.సాధారణ సర్వీసు టికెట్ ధరను ఎందుకు పెంచారు? రూ.60 నుంచి రూ.80కి పెంచేందుకు అధికారిక ఉత్తర్వులు ఉన్నాయా? ఉంటే వాటిని ప్రయాణికులకు ఎందుకు వెల్లడించలేదు? ‘స్పెషల్ బస్’ పేరుతో అదనపు చార్జీ వసూలు చేయడానికి నిబంధనలు ఏమిటి? అనే అంశాలపై ఆర్టీసీ అధికారులు స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు.ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో, మెట్‌పల్లి–జగిత్యాల మార్గంలో కూడా ఇదే తరహాలో చార్జీలు వసూలు చేస్తున్నారా అనే విషయంపై అధికారులు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు కోరుతున్నారు.ప్రయాణికుల నుంచి వస్తున్న అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి, టికెట్ ధర పెంపునకు కారణం, వర్తించే నిబంధనలు, అధికారిక ఉత్తర్వులు వంటి వివరాలను బహిరంగంగా వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.