జనం న్యూస్ సెప్టెంబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని అయినవిల్లి మండలంలోని ప్రసిద్ధ శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీద ప్రత్యేక లక్ష్మీ గణపతి హోమాన్ని జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు నరేంద్ర మోదీ గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ప్రధాని మోదీకి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, దేశానికి మరింత సేవ చేసే శక్తి ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా గనిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ అందిస్తున్న సేవలు, దేశ అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ జాతీయ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ మోదీ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆశీస్సులతో సంపూర్ణ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని, దేశ ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ అర్చకులను శాలువా లతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ కంచర్ల శివరామ్, యువమోర్చా మండల ప్రధాన కార్యదర్శి ఆకుల గంగబాబు తదితర కార్యకర్తలు, ఆలయ భక్తులు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.