కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో ఘనంగా 11వ అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవం జనం న్యూస్- సెప్టెంబర్ 23- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో 11వ అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రి హోమియో వైద్యులు డాక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆసుపత్రి సీఎంఓ డాక్టర్ హరికృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుర్వేదం భారతదేశానికి చెందిన ప్రాచీన వైద్య విధానం అని ఆరోగ్య పరిరక్షణతో పాటు వ్యాధులను నివారణకు ఆరోగ్యకరమైన జీవనశైలి సమతుల ఆహారం ప్రకృతితో అనుసంధానం వంటి అంశాలకు ఆయుర్వేదం ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. ప్రజలలో ఆయుర్వేద వైద్య విధానం పై అవగాహన పెంపొందించడంతోపాటు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకునేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. హోమియో డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని “ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం ఆయుర్వేదం” అనే ప్రధాన సందేశాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మానవాళి ఆరోగ్యానికి దిక్సూచిగా ఆయుర్వేదం పనిచేస్తుందని, ప్రకృతి ఒడిలో అందరికీ సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, తరతరాల భారతీయ వైద్య విధానానికి మూలం ఆయుర్వేదమైనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ డాక్టర్ హరికృష్ణ, హోమియోపతి డాక్టర్ అశోక్ కుమార్, నర్సింగ్ సూపర్డెంట్ సలీనా, కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.