అకాల వర్షానికి ఐకేపీ కేంద్రంలో తడిసిన ధాన్యం బస్తాలు.అధికారుల నిర్లక్ష్యంతో నష్టపోయిన రైతులు.. ఆవేదన వ్యక్తం
జనం న్యూస్ జూన్ 5 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : గండ్రవాణిగూడెం గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు అకాల వర్షానికి తడవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొనుగోలు కేంద్రంలో సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం, ధాన్యాన్ని భద్రపరిచే ఏర్పాట్లు లేకపోవడం వల్ల వందలాది బస్తాలు వర్షపు నీటిలో తడిసిపోయాయని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు తమ కష్టార్జిత పంటను ఐకేపీ కేంద్రానికి తీసుకొచ్చి చాలా రోజులుగా కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అధికారులు సకాలంలో ధాన్యాన్ని తరలించకపోవడం, వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ధాన్యం నాణ్యత దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అకాల వర్షం కురవడంతో పట్టాలపై ఆరబోసిన వడ్లు, నిల్వ ఉంచిన బస్తాలు పూర్తిగా తడిసిపోవడంతో రైతులు బోరున విలపించారు. ఇప్పటికే పెట్టుబడుల భారం, మార్కెట్ అనిశ్చితులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ ఘటన మరింత నష్టాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, తడిసిన ధాన్యాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలని కోరారు. అలాగే ఐకేపీ కేంద్ర నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రైతుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తడిసిన ధాన్యాన్ని రక్షించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు రైతులకు న్యాయం చేయాలని గ్రామస్థులు, రైతు సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.