అనపర్తి నియోజకవర్గంలో రూ.39.40 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు: ఎమ్మెల్యే నల్లమిల్లి_

August 27, 2026 | ఆంధ్రప్రదేశ్

అనపర్తి మండలం రామవరంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల కాలంలో అనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కొన్ని నిధులు మంజూరు కావడం జరిగిందని, మరో నాలుగైదు రోజుల్లో మరికొన్ని నిధులు మంజూరు కాబోతున్నాయని తెలిపారు. పుష్కరాలకు సంబంధించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా 5 కోట్ల రూపాయలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ శాంక్షన్ చేశారని చెప్పారు. అందులో తోస్సిపూడి నుంచి కొంకుదురు వరకు బుడతల మామిడి మీదగా సూరారెడ్డి నర్సింగ్ – హై స్కూల్ – కాలువ గట్టు రెండు కోట్ల రూపాయల తార్ రోడ్డు, వడిశలేరు నుంచి తూర్పుగొనగుడెం రోడ్డు బిటి రోడ్డుకు రెండు కోట్ల రూపాయలు, ఆర్ అండ్ బి రోడ్డు నుంచి దుప్పలపూడి – కొత్తూరుకు వెళ్ళే రహదారికి 70 లక్షల రూపాయలు మంజూరయ్యాయని వివరించారు. ఆర్ అండ్ బి రోడ్డు నుంచి పులగుర్తకు 2014-19లో చేసిన రోడ్డు కంటిన్యూటీకి 35 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చారని అన్నారు. మరో నాలుగైదు రోజుల్లో ఆర్ అండ్ బి రోడ్లు కొన్ని మంజూరు కాబోతున్నాయని, ముఖ్యంగా సోమేశ్వరం – రాజానగరం రోడ్డు రాయవరం నుంచి ఎస్టి రాజాపురం వరకు రాజానగరాన్ని కనెక్ట్ చేసే ఏడిపి రోడ్డుకు 10 కోట్ల రూపాయలు మంజూరు కానున్నాయని చెప్పారు. ఇది వాస్తవంగా 15 కోట్లకు ప్రతిపాదించామని, నిధులు తక్కువగా ఉండడం వల్ల 10 కోట్లకు కుదించారని, దీన్ని మరల 5 కోట్లు పెంచాలని కోరుతున్నామని అన్నారు. కాకినాడ – రాజమండ్రి కెనాల్ రోడ్డు బలభద్రపురం నుంచి అనపర్తి వరకు 5 కోట్ల రూపాయలు మంజూరు కానుందని, అనపర్తి నుంచి రాజమండ్రి వెళ్ళే వరకు పుష్కరాలకు వెళ్ళే వారికి సౌకర్యంగా ఉండేందుకు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు బుచ్చియ్య చౌదరి కృషితో 6 కోట్ల 30 లక్షల రూపాయలు మంజూరు కానున్నాయని తెలిపారు. బలభద్రపురంలో కాకినాడ – రాజమండ్రి కెనాల్ రోడ్డు, సోమేశ్వరం – రాజానగరం రోడ్డు కనెక్ట్ అయ్యే బ్రిడ్జ్ బ్రిటిష్ కాలం నాటిదని, అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉండడంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి దానికి 2.5 కోట్ల రూపాయలు నాలుగైదు రోజుల్లో జీవో రిలీజ్ అయ్యే పరిస్థితిలో ఉందని అన్నారు. అనపర్తి మండలానికి ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండడంతో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ 4 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు చేశారని చెప్పారు. అనపర్తి నుంచి పెడపర్తి రేవు వచ్చే రోడ్డు అభివృద్ధికి ఆర్ అండ్ బి శాఖ మంత్రి జనార్ధన్ రెడ్డికి ప్రతిపాదన ఇవ్వడం జరిగిందని, అది కూడా తప్పనిసరిగా మంజూరైతే నియోజకవర్గంలో అన్ని రోడ్లు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఇప్పటికే 80% బిటి రోడ్లను అభివృద్ధి చేశామని, సాస్కీ నుంచి మంజూరైన రోడ్లు టెండర్ ప్రక్రియలో ఆలస్యం కావడం వల్ల ఇంకా మొదలు కాలేదని, అవి కూడా త్వరలో మొదలవుతాయని చెప్పారు. రాబోయే విబి జీ రామ్ జీలో మిగిలిన రోడ్ల అభివృద్ధికి, పుంత రోడ్లకు ప్రతిపాదనలు ఇచ్చామని, రైతుల ఆకాంక్షలు నెరవేరే విధంగా చర్యలు తీసుకుంటామని మీడియా ద్వారా అనపర్తి నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ నిధుల మంజూరుకు సహకరించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్ అండ్ బి శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు అనపర్తి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ సమావేశంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper