22-ఏ నిషేధిత జాబితా నుంచి హైదర్‌నగర్ భూములను తొలగించాలి జనసేన నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమకుమార్ డిమాండ్
జనం న్యూస్ ఆగస్టు 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి హైదర్‌నగర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 145లో ఉన్న 90 ఎకరాలు, సర్వే నంబర్ 163లోని 14.26 ఎకరాల భూములను భూభారతి పోర్టల్‌లోని 22-ఏ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తక్షణమే తొలగించాలని కూకట్‌పల్లి జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమకుమార్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ భూముల్లోని వసంత్‌నగర్ కాలనీ, ఎన్.ఆర్.ఎస్.ఏ కాలనీతో పాటు ఇతర కాలనీల యజమానులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ప్రేమకుమార్ మాట్లాడుతూ.. సర్వే నంబర్లు 145, 163 భూములు నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండటంతో రిజిస్ట్రేషన్లు, భవన నిర్మాణ అనుమతులు, ఇతర ఆస్తి లావాదేవీలు నిలిచిపోయాయని తెలిపారు. ఈ భూములకు సంబంధించిన వివాదాలు చాలా కాలం క్రితమే పరిష్కారమయ్యాయని, న్యాయపరంగా ప్రైవేట్ వ్యక్తుల హక్కులు స్పష్టంగా నిర్ధారించబడ్డాయని చెప్పారు.
గతంలోనే ప్రభుత్వం కూడా ఆయా భూములపై ప్రైవేట్ వ్యక్తుల హక్కులను గుర్తించిందని ప్రేమకుమార్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మ్యూటేషన్ చేయాలని సూచిస్తూ 2004లో మెమో నం.28908/జెఎఐ/2004-1తో పాటు 2006, 2008 సంవత్సరాల్లోనూ ఉత్తర్వులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. 2005లో మ్యూటేషన్ ఆర్డర్ బి/7869/2001 జారీ కాగా, 2006–2009 మధ్య కాలంలో యూఎల్‌సీ క్రమబద్ధీకరణ కూడా జరిగిందన్నారు.అదేవిధంగా 1987, 1989 సంవత్సరాల్లో హుడా నుంచి లేఅవుట్ అనుమతులు, అనంతరం జీహెచ్‌ఎంసీ నుంచి ఎల్‌ఆర్‌ఎస్, భవన నిర్మాణ అనుమతులు పొందినట్లు తెలిపారు. 2004 నుంచి ఇటీవలి కాలం వరకు ఈ భూములకు సంబంధించి కొనుగోళ్లు, అమ్మకాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగాయని వివరించారు.ఇలాంటి పరిస్థితుల్లో వివాదం లేని భూములను ఇటీవల మళ్లీ నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చడం వల్ల అసలు యజమానులు, నిజమైన కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రేమకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సమగ్రంగా పరిశీలించి సర్వే నంబర్లు 145, 163లోని భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.ప్రజల ఆస్తి హక్కులకు భంగం కలిగించే విధంగా నిషేధం కొనసాగితే జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలబడి చట్టపరమైన, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేస్తుందని ముమ్మారెడ్డి ప్రేమకుమార్ స్పష్టం చేశారు.