ఎన్ఎస్పి అధికారుల నోటీసులుపై బిఆర్ఎస్ పార్టీ ఆందోళన
బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్ఎస్పిఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు వినతి పత్రం
జనం న్యూస్-మే 26- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్ఎస్పి క్వార్టర్స్ లో గత కొన్ని సంవత్సరాలుగా నివాసముంటున్న నివాసితులకు ఇల్లు ఖాళీ చేయాలి అంటూ నోటీసులు ఇవ్వటంపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డ్యాం పర్యవేక్షక ఇంజనీర్ ఆఫీసులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీతారాం నాయక్ కు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఉద్యమకారుడు హీరేకర్ రమేష్ జి మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 58, 59 జీవో ప్రకారం అనేక గృహాలను నివాసితులకే విక్రయించే ప్రక్రియ ప్రారంభమైందని, పలువురు నివాసితులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయిందని, ప్రభుత్వం మారిన సమయంలో ఈ జీవోలను నిలిపివేయడంతో ఈ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయిందని అన్నారు. ఎన్నికల హామీలలో భాగంగా మిర్యాలగూడ సభలో స్వయానా సీఎం రేవంత్ రెడ్డి నాగార్జునసాగర్ వాసులకు 58 59 జీవోలను తిరిగి ప్రారంభించి నివాసితులకే గృహాలు అందిస్తామని హామీ ఇచ్చారని, ఎన్నికల అనంతరం అట్టి హామీని తుంగలో తొక్కారని ఇదిలా ఉండగా ఇప్పుడు అధికారులు ఎన్ఎస్పి క్వార్టర్స్ ఖాళీ చేయండి అంటూ నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని, 58 59 జీవోల ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన గృహాలకు సైతం అదెబ్బకాయలు చెల్లించండి అంటూ నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదమని అన్నారు. 2021 తర్వాత అలాట్మెంట్ అయిన క్వార్టర్స్ కు నోటీసులు ఇస్తున్నామని కొంతమంది నాయకులు చెబుతున్నారని, ఈ నిబంధన కేవలం సామాన్యులకు మాత్రమేనా 2021 తర్వాత అలాట్మెంట్ చేయించుకున్న బడా నేతలకు, బడా బాబులకు చెల్లదా అని అన్నారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు స్థానిక నాయకులు స్పందించి ఎంతోకాలంగా ఎన్ఎస్పి క్వార్టర్స్ లో నివాసముంటున్న నివాసితులకు తగిన న్యాయం చేయాలని , ఇట్టి చర్యలను ఇప్పటికైనా ఆపకుంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి, నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ ఆధ్వర్యంలో ప్రజల తరఫున పోరాడటానికి నందికొండ బిఆర్ఎస్ పార్టీ ముందు ఉంటుందని అన్నారు. నకిరేకంటి సైదులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను ఇబ్బంది పెట్టడం అధికార పార్టీకి మంచిది కాదని, నది పూడికతీత పనుల కోసం వచ్చే ఉద్యోగుల కోసం ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్న వారిని ఖాళీ చేయమనడం ఏమాత్రం సమంజసం కాదని, వారికి ప్రత్యామ్నాయ వస్తువులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, 58 ,59 జీవోల ప్రకారం నివాసితులకు రిజిస్ట్రేషన్ చేస్తామని హామీలు గుప్పించి ఎన్నికల అనంతరం హామీలను మరచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా ఇటువంటి చర్యలు ఆపకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, ప్రజల పక్షాన పోరాడటానికి టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు రమేష్ జి, 8వ వార్డు కౌన్సిలర్ ముఖ్య సలహాదారుడు నకిరేకంటి సైదులు, 2వ వార్డు ఇంచార్జ్ మహమ్మద్ గని, 4వ వార్డు ఇన్చార్జి విజయ్,6 వ వార్డు ఇంచార్జ్ సపావత్ చంద్రమౌళి నాయక్, 10వ వార్డు ఇంచార్జ్ కోడా విజయ్, ఎస్సీ నాయకులు ఆదాసు విక్రం, నజీర్, షరీఫ్, లక్ష్మణ్ నాయక్, శేఖర్ చారి, ఎస్ కే రఫీ బాషా, ధారా రవి, కోదండ తదితరులు పాల్గొన్నారు.