కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏఐ టూల్స్, డిజిటల్ లెర్నింగ్‌పై శిక్షణ ప్రారంభం
జనం న్యూస్ జూన్ 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అన్నా–అక్క ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐదవ సెమిస్టర్ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మరియు డిజిటల్ లెర్నింగ్ అంశాలపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎంఎఫ్‌జే ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన కంప్యూటర్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మంజూష శిక్షణ అధికారిగా వ్యవహరిస్తున్నారు. శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చందన మాట్లాడుతూ, ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు, అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా ఏఐ టూల్స్, డిజిటల్ లెర్నింగ్‌పై శిక్షణ అందిస్తారని తెలిపారు.
విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించడం, సాంకేతిక విజ్ఞానాన్ని సమాజానికి చేరవేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విద్యార్థులకు భవిష్యత్ ఉపాధి అవకాశాల పరంగా కూడా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.ఈ శిక్షణ కార్యక్రమానికి కళాశాల నోడల్ సిబ్బందిగా డాక్టర్ మంజుల శ్రావణి మరియు డి. సుధీర్ నియమితులయ్యారు. వారి పర్యవేక్షణలో రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం కొనసాగనుంది.