కృష్ణారావు స్థాయికి మించి సీఎం రేవంత్‌రెడ్డిపై చౌకబారు విమర్శలు చేస్తున్నారు

August 29, 2026 | తెలంగాణ

కూకట్‌పల్లి అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం.. టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ సవాల్

జనం న్యూస్ ఆగస్టు 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి పదేళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన కృష్ణారావు కూకట్‌పల్లి నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని, స్థాయికి మించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చౌకబారు విమర్శలు చేయడం సరికాదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేసే సమయంలో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆయన కృష్ణారావును హెచ్చరించారు.శనివారం కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్, డివిజన్ అధ్యక్షులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో బండి రమేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పాలనను విమర్శిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని చెరువులు, నాలాలు, కుంటలు గత పాలనలో ఆక్రమణలకు గురయ్యాయని బండి రమేష్ ఆరోపించారు. హస్మత్‌పేట్ సర్వే నంబర్ 1లో సుమారు వంద ఎకరాల భూమిలో కేవలం పది ఎకరాలు మాత్రమే మిగిలాయని, అల్లాపూర్‌లో నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలు, గోపాల్‌నగర్‌లో సుమారు పది ఎకరాల ఖాళీ స్థలం కబ్జాకు గురైందని ఆరోపించారు. ఈ వ్యవహారాల్లో కృష్ణారావు, ఆయన అనుచరుల పాత్ర ఉందని బండి రమేష్ విమర్శించారు.అభివృద్ధిపై బహిరంగ చర్చకు సవాల్ పీజేఆర్ హయాం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో జరిగిన అభివృద్ధి, అలాగే బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని బండి రమేష్ సవాల్ విసిరారు. కృష్ణారావు తొలిసారి కౌన్సిలర్‌గా పోటీ చేసిన సమయంలో ఉన్న ఆస్తులు ఎంత, ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ ఎంత అని ప్రశ్నించారు.22ఏ అంశంలో కృష్ణారావు ‘ఉరి, హత్య, ఆత్మహత్య’ అంటూ ప్రజల సానుభూతి పొందేందుకు నాటకాలు ఆడుతున్నారని బండి రమేష్ విమర్శించారు. ఆయనను చంపాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు.హౌసింగ్ బోర్డు భూములపై ఎదురుదాడి
కాంగ్రెస్ ప్రభుత్వం హౌసింగ్ బోర్డు స్థలాలను విక్రయిస్తోందంటూ కృష్ణారావు చేసిన విమర్శలపై బండి రమేష్ తీవ్రంగా స్పందించారు. బీఆర్‌ఎస్ పాలనలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా విక్రయించారని, ఆ సమయంలో ఇవి కృష్ణారావుకు కనిపించలేదా అని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోందని బండి రమేష్ అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, గ్యాస్, రేషన్ కార్డులు, పెట్రోల్ బంకులు, బస్సులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మౌలిక వసతులుహైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా ఫ్లైఓవర్లు, అండర్‌ పాస్‌లు, బ్రిడ్జిలు, లింక్ రోడ్లు, స్కైవాక్‌ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రూ.10 లక్షల బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు విద్యా రంగంలో నూతన విధానాలకు శ్రీకారం చుట్టిందని బండి రమేష్ పేర్కొన్నారు. రానున్న ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్, డివిజన్ అధ్యక్షులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper