సామూహిక ఎలుకల నిర్మూలనతో వరి పంటను కాపాడుకుందాం
జనం న్యూస్ ఆగస్టు 29 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేను కోన మండలం: వరి పంటలో ఎలుకల వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొని పొలాల్లో ఎలుకల బొరియలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టారు. వరి సాగులో నాట్లు వేసిన దశ నుంచి పంట కోత వరకు అన్ని దశల్లో ఎలుకలు నష్టం కలిగిస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా పిలకలు వచ్చే దశలో మొక్కలను కొరకడం, కంకులు ఏర్పడిన తర్వాత గింజలను తినడం, కంకులను కొరికి నేలపై పడేయడం వల్ల పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందన్నారు. ఎలుకలు ఒక పొలం నుంచి మరో పొలానికి తిరుగుతాయి కాబట్టి ఒక్క రైతు మాత్రమే చర్యలు తీసుకోవడం వల్ల ఫలితం ఉండదని, గ్రామంలోని రైతులందరూ ఒకే సమయంలో సమన్వయంతో సామూహిక నిర్మూలన చేపడితేనే మంచి ఫలితం వస్తుందని సూచించారు. రైతులు ముందుగా బొరియలను గుర్తించి ఉపయోగంలో లేని వాటిని మట్టితో మూయాలని, ఎరలను వ్యవసాయ శాఖ సూచించిన పద్ధతిలోనే పిల్లలు, పశువులు, కోళ్లకు అందకుండా సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని తెలిపారు. పొలాల గట్లపై కలుపు, చెత్త, పంట అవశేషాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని, ఎలుకల నష్టం కనిపించిన వెంటనే దగ్గరి వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు. “ఎలుకల నిర్మూలన ఒక్క రైతు బాధ్యత కాదు.. అందరి సమిష్టి బాధ్యత. సామూహికంగా చర్యలు చేపడితే పంట నష్టాన్ని తగ్గించి దిగుబడిని కాపాడు కోవచ్చు” అని అధికారులు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం. వెంకట రామారావు, మండల వ్యవసాయ అధికారి బి. మృధుల, వ్యవసాయ సహకార పరపతి సంఘం సీఈఓ వై. రామచంద్రరావు, వ్యవసాయ సహాయకులు బరువు శ్రీను, కండికట్ల వెంకట రమణ, కాశి మధుబాబు తదితరులు పాల్గొన్నారు. అధికారులు రైతులకు అవగాహన కల్పించగా రైతులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.