గోపాల్‌నగర్ ప్రధాన రహదారి సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తాం బండి రమేష్
జ నం న్యూస్ జూలై 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి గోపాల్‌నగర్ మెయిన్ రోడ్ ప్లాట్ యజమానుల విజ్ఞప్తి మేరకు బండి రమేష్ ఈరోజు గోపాల్‌నగర్ ప్రధాన రహదారిని సందర్శించి, అక్కడి ప్లాట్ యజమానులతో సమావేశమై వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ప్లాట్ యజమానులు మాట్లాడుతూ, గోపాల్‌నగర్ లేఅవుట్ 1980లో ఏర్పడిందని, 1981లో ప్లాట్లను కొనుగోలు చేశామని తెలిపారు. అప్పట్లో ఆమోదించబడిన లేఅవుట్లో ప్రధాన రహదారి వెడల్పు నలబై అడుగులుగా మాత్రమే ఉందని, తమ వద్ద ఉన్న అన్ని రిజిస్టర్డ్ అమ్మకపు పత్రాల్లో కూడా నలబై అడుగుల రహదారే నమోదై ఉందని వివరించారు.మూసాపేట నుండి లింగంపల్లి వరకు ఇదే రహదారి అనేక ప్రాంతాల్లో ఆరవై నుండి యనబై అడుగుల వెడల్పుతో మాత్రమే ఉందని, అలాంటప్పుడు గోపాల్‌నగర్ ప్రాంతంలో మాత్రమే 120 అడుగుల రహదారి పేరుతో భూములను సేకరించడం పూర్తిగా అన్యాయమని తెలిపారు.ఈ సమస్య గత నలభై సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా కొనసాగుతోందని, చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ప్లాట్ యజమానుల హక్కులను ప్రభుత్వం పరిరక్షించాలని వారు బండి రమేష్ ని కోరారు.ప్లాట్ యజమానుల వినతిని, సంబంధిత పత్రాలను పరిశీలించిన అనంతరం బండి రమేష్ సమస్య తీవ్రతను గుర్తించి, సంబంధిత అధికారులతో చర్చించి ఈ సమస్యకు వీలైనంత త్వరగా న్యాయమైన పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.గోపాల్‌నగర్ మెయిన్ రోడ్ ప్లాట్ యజమానులు ఈ సందర్భంగా బండి రమేష్ కి తమ సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించి భరోసా కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ బాబు, వినోద్ చావా, శ్రీనివాస్, తిలక్, అనిల్, సుధాకర్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.