తులం బంగారం దేవుడెరుగు.. ఉన్న కల్యాణ లక్ష్మికే ఎసరు! కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌ ఫైర్‌

August 18, 2026 | తెలంగాణ

-కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని నిలిపివేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు

-హామీలు అమలు చేయలేకపోతే సీఎం రాజీనామా చేయాలి: బీఆర్‌ఎస్‌ నేతల డిమాండ్‌

కల్యాణ లక్ష్మి పథకంపై కాంగ్రెస్‌ సర్కార్‌కు బీఆర్‌ఎస్‌ షాక్‌.. కొత్త బస్టాండ్ చౌరస్తా ధర్నా

బిచ్కుంద ఆగస్టు 18 ( జనం న్యూస్)కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కేంద్రంలో ధర్నాకు దిగగా టిఆర్ఎస్ నాయకులు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తే ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.మాజీ శాసనసభ్యులు హనుమంత్ సిందే ఆదేశాల మేరకు మంగళవారం బిచ్కుంద మండలంలోని బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కొత్త బస్టాండ్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సుమారు గంటపాటు కొనసాగిన ఈ నిరసనతో బస్టాండ్ రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకటరావు దేశాయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచుల వివాహాలకు ఆర్థికంగా అండగా నిలిచే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను కొనసాగించాల్సింది పోయి, వాటిని నిలిపివేసే దిశగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలతో పాటు తులం బంగారం అందిస్తామని హామీ ఇచ్చిందని నాయకులు గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలను సైతం కొనసాగించకుండా రద్దు చేసేందుకు ప్రయత్నించడం బాధాకరమన్నారు. “తులం బంగారం దేవుడెరుగు.. ఉన్న సంక్షేమ పథకానికే ఎసరు పెట్టే పరిస్థితి వచ్చింది” అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.ప్రభుత్వం పథకాన్ని రద్దు చేసేందుకు న్యాయపరమైన మార్గాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసాగా ఉన్న ఈ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను యథావిధిగా కొనసాగించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం హామీని కూడా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. సంక్షేమ పథకాలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ ధర్నా కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్, మాజీ సర్పంచ్ సంజు పటేల్ మాజీ జెడ్పిటిసి రాజు సొసైటీ చైర్మన్ బాలాజీ , పుల్కల్ రాజు పటేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ సొసైటీ వైస్ చైర్మన్ యాదవ్ చిత్రం పల్లి మాజీ సర్పంచ్ గంగారెడ్డి సంగారెడ్డి హాజీ లక్ష్మణ్ బొమ్మల లక్ష్మణ్ హనుమాన్లు దడిగి విట్టల్ రెడ్డి చేతన్ పవన్ సాయిలు రామ్ చందర్ ఆనంద్ పటేల్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🌐 Select Language:
📰 ePaper