25వ వార్డులో పునరుద్ధరించిన బోరుబావిని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి
తాగునీటి సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీ కృషి
జనం న్యూస్, ఆగస్టు 18, జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి: మెట్‌పల్లి పట్టణ ప్రజల తాగునీటి సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీ నిరంతరం కృషి చేస్తోందని మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి తెలిపారు.మెట్‌పల్లి పట్టణంలోని 25వ వార్డులో గత కొంతకాలంగా నిరుపయోగంగా ఉన్న బోరుబావిని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పునరుద్ధరించారు. ఇందులో భాగంగా బోరును మరింత లోతుగా ఫ్లషింగ్, డ్రిల్లింగ్ చేయడంతో పాటు కాలిపోయిన పాత మోటార్‌ను తొలగించి నూతన మోటార్ పంపును ఏర్పాటు చేశారు.పనులు పూర్తికావడంతో మంగళవారం మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బోరుబావి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి నూతన మోటార్‌ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. 25వ వార్డులో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా బోరుబావిని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. పట్టణంలోని ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ గుడికందుల అజయ్, నాయకులు జావిద్, ఇతర ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.