ప్రజావాణి ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

August 3, 2026 | వైరల్ వార్తలు

కలెక్టరేట్ ప్రజావాణిలో 48 వినతులు స్వీకరణ….జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్
3, ఆగస్ట్ సంగారెడ్డి,

జనం న్యూస్ ఆగస్టు 03:–ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదు, వినతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్దిష్ట రిమార్కులతో సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు సంగీత, పాండుతో కలిసి ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో అందిన ప్రతి వినతిని వాస్తవ పరిస్థితుల ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలించి, స్పష్టమైన నివేదికలు, నిర్దిష్ట రిమార్కులతో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.అలాగే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు.నేటి ప్రజావాణిలో జిల్లావ్యాప్తంగా మొత్తం 67 ఫిర్యాదులు, వినతులు అందాయని తెలిపారు. వీటిలో కలెక్టరేట్‌లో 48, సంగారెడ్డి డివిజన్‌లో 8, జహీరాబాద్ డివిజన్‌లో 7, నారాయణఖేడ్ డివిజన్‌లో 4 వినతులు అందగా, అందోల్ డివిజన్‌లో ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదని పేర్కొన్నారు.అందిన వినతులు ప్రధానంగా రెవెన్యూ, హౌసింగ్, పెన్షన్లు, ఈఈ (పంచాయతీరాజ్), పంచాయతీరాజ్, నీటిపారుదల, కాలుష్య నియంత్రణ మండలి , కార్మిక, విద్య, ఆర్టీసీ, ఉపాధి కల్పన, మహిళా మరియు శిశు సంక్షేమం, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖలకు సంబంధించినవని తెలిపారు.ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంగారెడ్డి ఆర్డీఓ, కలెక్టరేట్ రెవెన్యూ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper