ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్యుడికి దక్కని గౌరవం…

May 17, 2026 | తెలంగాణ

పదవి అనేది అధికారం చెలాయించడానికి కాదు.. బాధ్యతను నెరవేర్చడానికి లభించిన ఒక అవకాశం.

జనం న్యూస్ తేదీ మే 17నేను గత కొంతకాలంగా మన ప్రాంతంలోని అనేక ప్రభుత్వ కార్యాలయాలను ప్రత్యక్షంగా సందర్శించాను. అక్కడ నేను గమనించిన పరిణామాలు మనసును కలచివేస్తున్నాయి. కార్యాలయానికి వచ్చే సామాన్యుల పట్ల కొంతమంది అధికారుల ప్రవర్తన అత్యంత దురుసుగా, అగౌరవంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యం అంశాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నానుజీతం వస్తోంది సామాన్యుడి టాక్స్ వల్లే!ప్రతి ప్రభుత్వ అధికారి గుర్తుంచుకోవాల్సిన ప్రాథమిక సూత్రం ఒకటి ఉంది  మీ హోదా ఏదైనా, మీకు నెలాఖరున వచ్చే జీతం సామాన్యుడు కట్టే పన్నుల నుంచే వస్తోంది. ప్రజలే ప్రభుత్వానికి యజమానులు, అధికారులు సేవకులు మాత్రమే. యజమాని లాంటి సామాన్యుడు తన పని కోసం వచ్చినప్పుడు అతడిని చిన్నచూపు చూడటం అంటే, మీరు తింటున్న అన్నాన్ని మీరే అవమానించుకోవడమే.వస్త్రధారణ చూసి విలువ ఇవ్వకండిచాలా చోట్ల గమనించిన విషయం ఏమిటంటే.. సూటు, బూటు వేసుకుని వచ్చిన వారికి లభించే మర్యాద, మాసిన బట్టలతో వచ్చే పేదవాడికి దక్కడం లేదు. మనిషి వేసుకున్న బట్టలను చూసి కాదు, ఎదురుగా ఉన్నది ఒక మనిషి అనే మానవత్వంతో గౌరవం ఇవ్వండి. సామాన్యుడికి కావాల్సింది మీ ఆస్తులు కాదు, మీరు ఇచ్చే ఒక చిన్న మర్యాద.’కూర్చోండి’ అనే ఒక్క మాట ఎంతో ఊరటదూర ప్రాంతాల నుండి ఎన్నో ఆశలతో కార్యాలయానికి వచ్చే వృద్ధులు, మహిళలు, వికలాంగులు గంటల తరబడి నిలబడి ఉండటం చూస్తుంటే బాధ కలుగుతుంది. “కూర్చోండి.. మీ సమస్య ఏంటో చెప్పండి” అని మీరు అనే ఒక్క చిన్న మాట, వారి సగం బాధను తగ్గిస్తుంది. ఆ పలకరింపులో ఉన్న ఆత్మీయత ఆ ప్రభుత్వ శాఖ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుంది.ఓపికగా వినడం కూడా ఒక సేవయేప్రభుత్వ పనుల్లో నిబంధనలు ఉండవచ్చు, కొన్ని పనులు వెంటనే కాకపోవచ్చు. కానీ, ఎందుకు కాదో లేదా ఎలా చేసుకోవాలో ప్రశాంతంగా వివరించడం అధికారుల బాధ్యత. చిరాకు పడటం, విసుక్కోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు సదా, ఆ వ్యక్తి మనసు గాయపడుతుంది. మీ పదవికి ఇచ్చే విలువ మీరు ఇచ్చే సమాధానంలోనే ఉంటుంది.మార్పు మనతోనే మొదలవ్వాలికొన్ని కార్యాలయాల్లో మార్పు కనిపిస్తోంది, అధికారుల తీరు మారుతోంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ ఇది అన్ని చోట్లా జరగాలి. ప్రతి అధికారి తనను తాను ఒక్క నిమిషం ఆ సామాన్యుడి స్థానంలో ఉంచుకుని ఆలోచించాలి. మీరు రిటైర్ అయ్యాక అదే సామాన్యుడి వరుసలో నిలబడాల్సి ఉంటుందని మర్చిపోవద్దు.అధికారులారా! పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మీరు సామాన్యుడికి ఇచ్చే గౌరవం, వారి సమస్యల పట్ల మీరు చూపే కరుణ మాత్రమే మిమ్మల్ని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుపుతాయి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.. మీరు ఇచ్చే గౌరవం తిరిగి మీకు వంద రెట్లు గౌరవాన్ని, ఆత్మీయతను తెచ్చిపెడుతుంది. సమాజంలో మీకంటూ ఒక గొప్ప స్థానాన్ని ఇస్తుంది.డా.పెద్దగొల్ల నారాయణ.ప్రముఖ కవి, రచయిత.

🌐 Select Language:
📰 ePaper