ప్రభుత్వ విద్యకు అత్యున్నత ప్రాధాన్యత.. రూ.30 వేల కోట్ల కేటాయింపు ఇందుకు నిదర్శనం : బండి రమేష్
జనం న్యూస్ జూన్ 20 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రూ.30 వేల కోట్ల నిధులను కేటాయించడం ద్వారా విద్యాభివృద్ధికి తన కట్టుబాటును చాటిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. బాలానగర్ మండల పరిధిలోని బబ్బుగూడ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రేణుక, స్ఫూర్తి, విఘ్నేష్లకు అభినందనలు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించి అభినందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో గౌరవం, గుర్తింపు, ఉన్నత స్థానం సాధించడానికి విద్యే ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి విజయమే లక్ష్యంగా పెట్టుకుని కృషి చేస్తూ పోటీతత్వంతో చదువుకోవాలని సూచించారు. నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు, సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బండి రమేష్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు రాఘవేంద్ర, డివిజన్ అధ్యక్షుడు సతీష్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, రవి గౌడ్, నరసింహులు, రాజేష్, గోపాల్ చౌదరి, సాత్విక్ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానికంగా ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. విద్యార్థుల విజయాలను మరింత మంది ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని పలువురు నాయకులు ఆకాంక్షించారు.