ప్రమాదానికి గురైన మత్స్యకారుడిని పరామర్శించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
జనం న్యూస్, జూలై 13,అచ్యుతాపురం :అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం పూడిమడక సముద్ర తీరంలో వేటకు వెళ్లిన ఓ మత్స్య కారుడు ప్రమాదానికి గురయ్యాడు.వేట సాగిస్తున్న సమయంలో బోటు ఇంజిన్‌లోని ఇనుప భాగం విరిగి అతని చేతికి తగలడంతో స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఆయనను చికిత్స నిమిత్తం వడ్లపూడిలోని పవన్ సాయి హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదంలో గాయపడిన పూడిమడక గ్రామానికి చెందిన పైడికొండను ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు..బాధితుడు త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.