బీసీల రిజర్వేషన్ పెంపు పై నీరుకొండ వీరన్న చౌదరి హర్షం
జనం న్యూస్ ఆగస్టు 19 ముమ్మిడివరం ప్రతినిధి+ గ్రంధి నానాజీ)రాజమండ్రి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చే నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని రాజనగరం మాజీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీసీల తరపున కృతజ్ఞతలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. రాబోయే స్థానిక సంస్థల నుండి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని చెప్పారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బీసీలకు సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత కల్పించే దిశగా డబల్ ఇంజన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం స్వాగతించదగ్గదన్నారు.ఆనాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బీసీలకు 20 శాతం రిజర్వేషన్లను అమలు చేసి వారి అభ్యున్నతికి బాటలు వేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీల రిజర్వేషన్ కోటాను 34 శాతానికి పెంచడం బీసీల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు అధిక ప్రాతినిధ్యం లభించడం ద్వారా గ్రామస్థాయి నుంచి బీసీలు మరింత బలోపేతం అవుతారని అన్నారు.ఇచ్చిన మాట నిలబెట్టుకుని బీసీలకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి, డబల్ ఇంజన్ సర్కార్ కు వీరన్న చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయంలో భాగంగా బీసీలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.