మెట్‌పల్లి సాయిరాం కాలనీలో డ్రై డే, జ్వర సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ
జనం న్యూస్, జులై 10, జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి: పట్టణంలో ఈ రోజు సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక చర్యలను పర్యవేక్షించేందుకు మెట్‌పల్లి పట్టణంలోని సాయిరాం కాలనీలో నిర్వహిస్తున్న డ్రై డే కార్యక్రమాలు, ఇంటింటి జ్వర సర్వేను డిప్యూటీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. ఎం. జైపాల్ రెడ్డి, పీవో (NVBDCP) డా. అర్చనా ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు ఇంటింటికి వెళ్లి ఆశా కార్యకర్తలు నిర్వహిస్తున్న జ్వర సర్వేను పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాల నమోదు, జ్వర లక్షణాలు ఉన్న వారి గుర్తింపు, అవసరమైన పరీక్షల కోసం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు పంపించడం, చికిత్స అందేలా తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.డ్రై డే కార్యక్రమాల అమలును పరిశీలిస్తూ ఇంటి పరిసరాలు, ఖాళీ స్థలాలు, కూలర్లు, నీటి ట్యాంకులు, పూల కుండీలు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, వాడని పాత్రల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. దోమల ఉత్పత్తి కేంద్రాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి శుక్రవారం డ్రై డేను తప్పనిసరిగా పాటించేలా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. ఎం. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులతో పాటు వైరల్ జ్వరాలు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జ్వరం వచ్చిన వెంటనే స్వయంగా మందులు వాడకుండా సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని, ఆరోగ్య సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని కోరారు.పీవో (NVBDCP) డా. అర్చనా ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు క్షేత్రస్థాయిలో సర్వేను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రతి జ్వర కేసును సకాలంలో గుర్తించి నమోదు చేయాలని, అనుమానిత డెంగ్యూ, మలేరియా లక్షణాలు ఉన్న వారిని వెంటనే పరీక్షలకు పంపించాలని సూచించారు. ప్రజలకు దోమల నివారణ చర్యలు, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై నిరంతరం అవగాహన కల్పించాలని తెలిపారు.ఈ సందర్భంగా వైద్యాధికారి డా. వొంటెల వాణి, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.