స్మార్ట్ సిటీ జహీరాబాద్: ప్రగతి పథం – ప్రజా అవసరాలు
డా.పెద్దగొల్ల నారాయణ. ప్రముఖ కవి రచయిత
జనం న్యూస్ తేదీ 23-05-20.26 మన దేశంలో నేడు అనేక నగరాలు జెట్ వేగంతో అభివృద్ధి చెందుతున్నాయి. ఆ ప్రగతి ప్రవాహంలో భాగమే మన జహీరాబాద్ ప్రాంతం. తెలంగాణ సరిహద్దుల్లో వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న జహీరాబాద్.. ఇప్పుడిప్పుడే మౌలిక వసతులను సమకూర్చుకుంటూ స్మార్ట్ సిటీ దిశగా అడుగులు వేస్తోంది. ఇటు వ్యవసాయ సంపదతో, అటు పారిశ్రామిక హబ్‌గా ఎదుగుతున్న ఈ ప్రాంత పురోగతిని, ఇక్కడి ప్రజా అవసరాలను ఒకసారి పరిశీలిస్తే వ్యవసాయ వైవిధ్యం – నేలల గొప్పదనం జహీరాబాద్ ప్రాంతం ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వ్యవసాయ భూములకు నిలయం. ఇక్కడి ఎర్ర, నల్ల, చెలక నేలలు వైవిధ్యభరితమైన పంటలకు అనుకూలమైనవి.ప్రధాన పంటలు చెరుకు, అల్లం, అలుగడ్డలు (బంగాళాదుంపలు) ఇక్కడ విస్తారంగా పండుతాయి.వర్షాధార పంటలుపత్తి, మినుము, పెసర, కందులు, జొన్నలతో పాటు అనేక రకాల కూరగాయలను ఇక్కడి రైతాంగం శ్రమిస్తూ పండిస్తున్నారు.పారిశ్రామిక హబ్ మరియు నిమ్జ్ (NIMZ) ఊతం జహీరాబాద్ కేవలం వ్యవసాయానికే కాదు, పరిశ్రమలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మహీంద్రా అండ్ మహీంద్రా, నికోలస్ ఫార్మా, హట్సన్, ముంగి వంటి దిగ్గజ కంపెనీలు ఇక్కడ కొలువుదీరాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిమ్జ్ (NIMZ – National Investment and Manufacturing Zone)ద్వారా దాదాపు 1.20 లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుందని అంచనా. గతంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు పాలిస్తున్న నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని పరిశ్రమలకు శంకుస్థాపనలు చేశాయి. అయితే, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (BJP) దేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీ సుందరీకరణ పాలసీ పరిధిలోకి జహీరాబాద్‌ను తీసుకువచ్చి, మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. యువతకు నైపుణ్యం – ప్రభుత్వ ఐటిఐ (ITI) అవశ్యకత జహీరాబాద్ నియోజకవర్గంలో ఝారసంగం, మొగుడంపల్లి, కోహిర్, న్యాల్కల్, జహీరాబాద్ మండలాలు ఉన్నాయి.అదే విదంగా ఒక sc రిసేర్వేడ్ శాసనసభ స్తానం కూడా ఉంది. ఈ మధ్యనే కోహిర్‌ను మున్సిపాలిటీగా కూడా ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద పారిశ్రామిక ప్రాంతంలో స్థానిక యువతకు ఉద్యోగాలు రావాలంటే నైపుణ్యం ముఖ్యం. కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జహీరాబాద్‌లో ఒక అత్యాధునిక ప్రభుత్వ ఐటిఐ (ITI) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా యువతకు ఇక్కడే శిక్షణ ఇస్తే, మన ప్రాంత నిరుద్యోగ సమస్య పూర్తిగా తొలగిపోతుంది.రాజకీయ చొరవ – పెండింగ్ ప్రాజెక్టులుపాస్‌పోర్ట్ ఆఫీస్ గతంలో ఎంపీగా ఉన్న బి.బి. పాటిల్ హయాంలో కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్‌కు నూతన పాస్‌పోర్ట్ ఆఫీస్‌ను ప్రకటించింది. కానీ నేటికీ అది కార్యరూపం దాల్చకపోవడం శోచనీయం. ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు పెద్దలు సురేష్ కుమార్ షెట్కార్ చొరవ తీసుకుని, ఈ విడత అయినా పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయించాలని ప్రజలు కోరుకుంటున్నారు.హోటల్ మేనేజ్మెంట్ కళాశాల గతంలో శ్రీమతి గీతారెడ్డి ప్రాతినిధ్యం వహించినప్పుడు కేంద్రీయ విద్యాలయం, కోహిర్ చౌరస్తాలో హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ తెచ్చారు. కేంద్రీయ విద్యాలయం సక్రమంగా నడుస్తున్నప్పటికీ.. హోటల్ మేనేజ్మెంట్ భవనం మూలనపడింది. దీనిపై అధికారులు దృష్టి సారించి పునఃప్రారంభిస్తే ఎంతో మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయి.విద్యా రంగంలో సంస్కరణలు – ఉపాధ్యాయ శిక్షణప్రస్తుతం ఇక్కడ ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మూడు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, ఐదు ఇంటర్ కాలేజీలు, మూడు రెసిడెన్షియల్ విద్యాలయాలు ఉన్నాయి. ఒక ప్రైవేట్ TTC, B.Ed కళాశాలలు ఉన్నప్పటికీ.. ఫీజులు భరించలేని బలహీన వర్గాల (BC, SC, ST) విద్యార్థుల కోసం ప్రభుత్వ రంగంలో TTC, B.Ed కళాశాలలను ఏర్పాటు చేయాలి. అలాగే కలిల్పూర్ – మీర్జాపూర్ ప్రాంతంలో ఉన్న పీజీ (PG) సెంటర్ నిర్వహణను మెరుగుపరిచి, మరిన్ని అనుబంధ కోర్సులను ప్రవేశపెట్టాలి.నా ఆశయం: 60 వేల పుస్తకాలతో ఒక మహాగ్రంథాలయం
నేను ఒక కవిగా, రచయితగా సమాజంలో అక్షరానికి ఉన్న విలువను నమ్ముతాను. జహీరాబాద్ స్మార్ట్ సిటీగా మారే క్రమంలో యువత మేధస్సుకు పదును పెట్టేందుకు అన్ని వసతులతో కూడిన, 60 వేల వివిధ విభాగాలకు సంబంధించిన పుస్తకాలతో ఒక బృహత్ ప్రభుత్వ గ్రంథాలయాన్ని (Library) ఏర్పాటు చేయాలి. ఇది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఒక దేవాలయంలా ఉపయోగపడుతుంది.మరికొన్ని అత్యవసర డిమాండ్లుమెడికల్ కాలేజ్ జహీరాబాద్ చుట్టుపక్కల పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి రావాలంటే ఇక్కడొక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అవసరం ఎంతైనా ఉంది.ట్రాఫిక్ పోలీస్ స్టేషన్.నగరం వేగంగా విస్తరిస్తున్నందున రద్దీ పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మించాలి.CSR నిధుల జవాబుదారీతనం. ఇక్కడున్న కంపెనీలు తమ CSR (Corporate Social Responsibility) నిధులను జహీరాబాద్ పరిసర ప్రాంతాల మౌలిక వసతుల కోసమే ఖర్చు చేయాలి. ఎన్నో ఏళ్లుగా ఈ నిధులు దుర్వినియోగం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం. దీనిపై కఠిన నిఘా ఉంచాలి. చక్కెర పరిశ్రమ మరియు కోల్డ్ స్టోరేజ్ ప్రధాన పంట అయిన చెరుకు రైతులకు అండగా ఉండటానికి ఒక ఆధునిక చక్కెర పరిశ్రమను, అలాగే అల్లం, అలుగడ్డలు పాడవకుండా దాచుకోవడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాన్ని కల్పించాలి.జహీరాబాద్ ప్రాంతానికి ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఇక్కడి ప్రజాప్రతినిధులు, పాలకులు రాజకీయాలకు అతీతంగా చొరవ చూపి, పైన పేర్కొన్న సమస్యలను పరిష్కరిస్తేనే.. జహీరాబాద్ నిజమైన అర్థంలో “స్మార్ట్ సిటీ”గా మారుతుంది. పాలకులారా, ఒక్కసారి ఆలోచించండి.. ప్రజా శ్రేయస్సుకై అడుగులు వేయండి!