జహీరాబాద్ నియోజకవర్గం న జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశంనవంబర్ 14. 11. 2026 జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని రైతులకు సాగునీటి కొరత లేకుండా ప్రభుత్వం సింగూర్ ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలని సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ డిమాండ్ చేశారు. సింగూర్ ప్రాజెక్టు పనులు గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యే లోపే ప్రాజెక్టు పనులు పూర్తి చేసి సాగునీరు అందుబాటులోకి తీసుకొస్తే జహీరాబాద్ నియోజకవర్గంలోని వేలాది మంది రైతులకు ఎంతో ప్రయోజనం కలిగేదని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తయితే రైతులకు సాగునీటి కొరత తగ్గడంతో పాటు పంటలు సమృద్ధిగా పండించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం భూగర్భ జలాల మట్టం రోజురోజుకూ తగ్గిపోతుండటంతో బోరుబావుల్లో నీటి లభ్యత తగ్గి రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. భూగర్భ జలాలపై ఆధారపడకుండా ప్రాజెక్టు నీటిని సాగుకు వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోయే వర్షాకాలం నాటికైనా సింగూర్ ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి జహీరాబాద్ నియోజకవర్గ రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని చిట్టెంపల్లి బాలరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.