జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి. వీరేశం నవంబర్ 15. 11. 2026 జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు లేక పంటల సాగు, పెట్టుబడులు, వ్యవసాయ పనుల విషయంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికే వ్యవసాయ పెట్టుబడుల కోసం అప్పులు చేసి సాగు పనులు చేపట్టిన రైతులు వర్షాభావ పరిస్థితులతో ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. రైతులకు అండగా ఉంటామని ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీతో పాటు ఇతర వ్యవసాయ హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చాలని కోరారు. అప్పుల భారం, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులతో సతమతమవుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి ఆర్థిక భరోసా కల్పించేలా తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తే రైతు కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రజల్లో కూడా సంతోషం నెలకొంటుందని చిట్టెంపల్లి బాలరాజ్ ప్రభుత్వాన్ని కోరారు.