జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

June 3, 2026 | తెలంగాణ

టీయూడబ్ల్యూజే జిల్లా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి దాసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

జనం న్యూస్ – జూన్ 3- నాగార్జునసాగర్ టౌన్-టీయూడబ్ల్యూజే (ఐజేయు) నల్గొండ జిల్లా స్థాయి మహాసభ బుధవారం నకిరేకల్ పట్టణంలో రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి,
అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరై సంఘ బలోపేతం, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.మహాసభలో భాగంగా నూతన జిల్లా కమిటీలను ప్రకటించారు. ఇందులో టీయూడబ్ల్యూజే (ఐజేయు) నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ ప్రధాన  కార్యదర్శిగా నాగార్జునసాగర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు దాసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన వరుసగా రెండోసారి ఈ కీలక పదవికి ఎన్నిక కావడం విశేషంగా నిలిచింది. జర్నలిస్టు వర్గాల్లో ఆయనకు ఉన్న విశ్వాసం, సేవా భావానికి ఈ ఎన్నిక నిదర్శనంగా భావిస్తున్నారు.ఈ సందర్భంగా దాసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వారి వృత్తి భద్రత, సంక్షేమం, గుర్తింపు, ప్రభుత్వ పరంగా రావలసిన సౌకర్యాల సాధన కోసం సంఘం తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.జర్నలిస్టుల ఐక్యతే సంఘ బలమని పేర్కొన్న ఆయన, ప్రతి జర్నలిస్టు సమస్యను తన సమస్యగా భావించి స్పందిస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు యువ జర్నలిస్టులకు ప్రోత్సాహం, వృత్తిపరమైన శిక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.తనను ప్రెస్ క్లబ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకుని బాధ్యతలు అప్పగించిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర, జిల్లా నాయకత్వంతో పాటు కార్యవర్గ సభ్యులు, జిల్లా జర్నలిస్టులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper