శేరిలింగంపల్లి బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు పాల్గొనడం
జనం న్యూస్ జూన్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; మియాపూర్‌లోని నరేన్ గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వివేకానంద నగర్ డివిజన్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ప్రసంగించిన కేటీఆర్, జూన్ 24 నుంచి ప్రారంభమయ్యే ఎస్ఐఆర్ (ఓటరు సమగ్ర సవరణ) ప్రక్రియపై పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి బూత్‌లోని కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాలను పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే అక్రమంగా నమోదైన దొంగ ఓట్లను గుర్తించి తొలగించే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించిన కేటీఆర్, వీలైనంత ఎక్కువ మందిని బీఆర్ఎస్ సభ్యులుగా చేర్చాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించిన ఆయన, ఈ విషయాలను ప్రజలకు వివరించి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు ప్రజాదరణ పెరిగేలా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గొట్టుముక్కల పెద్ద భాస్కరరావు, మాచర్ల భద్రయ్య, వేముల ఆంజనేయులు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వివేకానంద నగర్ డివిజన్ నుంచి మాజీ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావడం విశేషంగా నిలిచింది.