ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం.వంద మందికి రూ.15 వేల చొప్పున చెక్కుల పంపిణీ
జనం న్యూస్ జూన్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి ఆర్థిక అండగా నిలుస్తూ, ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు మరియు గనులు భూగర్భ శాఖల మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి బుధవారం కూకట్‌పల్లిలోని అనేవా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో వంద మంది విద్యార్థులకు ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు.జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని హైదరాబాద్, జగిత్యాల, మంథని, రాజన్న సిరిసిల్ల, పాలేరు కళాశాలల్లో ప్రస్తుతం రెండవ, మూడవ సంవత్సరాలు చదువుతున్న ప్రతిభావంతులైన మరియు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున చెక్కులను అందజేశారు. మొత్తం వంద మంది విద్యార్థులు ఈ సహాయాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి. కిషన్ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎ. జయలక్ష్మి, యూసీఈఎస్‌టీఎచ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.వి. నరసింహ రెడ్డి, యూసీఈపీ ప్రిన్సిపాల్ డాక్టర్ వి. వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.కాగా, గత ఐదేళ్లుగా అనేవా సంస్థ ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి సత్కరించడంతో పాటు వారికి ఆర్థిక సహాయం అందిస్తూ విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తోందని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల విద్యా ప్రగతికి ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతున్నాయని వారు పేర్కొన్నారు.