వివాదాస్పద సర్వే ఆపాలి బకాయి లీజు డబ్బులు వెంటనే చెల్లించాలని తహసీల్దార్ కు వినతిపత్రం అందజేసిన ఎస్సీ రైతులు
జనం న్యూస్ జులై 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం వివాదాస్పద సర్వే ఆపాలి
బకాయి లీజు డబ్బులు వెంటనే చెల్లించాలి భూములను చదును చేసి సాగుకు అప్పగించాలి అనిమండలంలోని తహరాపూర్ గ్రామానికి చెందిన ఎస్సీ (మాదిగ) రైతుల భూ సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని రైతు రేణికుంట్ల సదయ్య డిమాండ్ చేశారు.ఈ మేరకు శుక్రవారం నాడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక తహసీల్దార్ తమ ఫిర్యాదులపై నిష్పాక్షికంగా స్పందించడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి ఎస్సీ రైతులకు న్యాయం చేయాలని కోరారు.
1972లో ప్రభుత్వం సర్వే నంబర్ 112లోని భూమిని 20 మంది ఎస్సీ రైతులకు పట్టాలుగా కేటాయించిందని, అప్పటి నుంచి రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అయితే గ్రామానికి చెందిన కాటం తిరుపతిరెడ్డి, కాటం రవీందర్‌రెడ్డి సర్వే నంబర్లు 106, 107, 108, 109లోని భూములకు సంబంధించి తమ హక్కులను దెబ్బతీసే చర్యలు చేపట్టారని ఆరోపించారు.2015–16లో క్రషర్ నిర్వహణ కోసం భూములు లీజుకు తీసుకున్న సమయంలో మొరం, రాళ్లు తరలించి, అనంతరం డాంబర్, కంకర వేయడంతో భూములు సాగుకు పనికిరాకుండా మారాయని పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లుగా 20 ఎకరాలకు సంబంధించిన లీజు బకాయిలు రైతులకు అందలేదని, ఎకరానికి రూ.60 వేల చొప్పున రావాల్సిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.క్రషర్ కారణంగా దెబ్బతిన్న భూములను చదును చేసి తిరిగి వ్యవసాయానికి అనువుగా మార్చాలని, కొడిశలకుంట కట్ట మీదుగా ఉన్న సంప్రదాయ దారిని పునరుద్ధరించాలని కోరారు. అలాగే వివాదాస్పద సర్వేపై సమగ్ర విచారణ జరిపి, సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో కొమ్ముల మల్లయ్య పలువురు ఎస్సీ రైతులు పాల్గొని, తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు….