సైబరాబాద్‌లో ఐదుగురు పోలీస్ అధికారుల పదవీ విరమణసేవలను గుర్తుచేసుకుంటూ ఘనంగా సన్మానం చేసిన సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్

August 31, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 31 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న ఐదుగురు పోలీస్ అధికారులకు వీడ్కోలు కార్యక్రమం సోమవారం సైబరాబాద్ సీపీ కార్యాలయ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.పదవీ విరమణ పొందుతున్న ఎస్సై ఎం. రవీందర్ రెడ్డి (కేపీహెచ్‌బీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్), ఎస్సై పి. విజయ్ భాస్కర్ రెడ్డి (ఎస్ బి సైబరాబాద్), ఆర్ఎస్ఐ ఫరీద్ ఖాన్ (సైబరాబాద్ కార్ హెడ్‌క్వార్టర్స్), ఏ ఎస్ ఐ టి. కేశవులు (అత్తాపూర్), హెచ్ జి ఏబీ శర్మ (బాలానగర్ ట్రాఫిక్)లను పోలీస్ శాఖ ఘనంగా సత్కరించింది.ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ,పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించిన అధికారులు పదవీ విరమణ పొందడం ఒక కొత్త జీవిత అధ్యాయానికి నాంది అని అన్నారు. విధి నిర్వహణలో అధికారులు అందించిన సేవలు, అనుభవం పోలీస్ శాఖకు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. పోలీస్ అధికారులు తమ విధులను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించడంలో వారి సహధర్మచారులు, కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకమని సీపీ అన్నారు. కుటుంబ సభ్యుల మద్దతు లేకుండా పోలీసు ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యం కాదని తెలిపారు.పదవీ విరమణ అనంతరం అధికారులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో ఆనందంగా సమయం గడపాలని సీపీ సూచించారు. ఖాళీగా ఉండకుండా సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి తమ వంతు సేవ చేయాలని కోరారు. హైదరాబాద్ నగరం, సైబరాబాద్ ప్రాంతం అభివృద్ధిలో పోలీస్ శాఖ కూడా తన వంతు కీలక పాత్ర పోషించిందని, ఆ అభివృద్ధిలో భాగస్వాములైన పోలీస్ అధికారులు గర్వపడాలని సీపీ అన్నారు.పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి అందే రిటైర్మెంట్ ప్రయోజనాలు, డబ్బులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని, తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని సూచించారు. పోలీస్ శాఖకు అవసరమైన సందర్భాల్లో పదవీ విరమణ పొందిన అధికారులు తమ అనుభవం, సూచనలతో శాఖకు సహకరించాలని సీపీ కోరారు. అనంతరం పదవీ విరమణ పొందిన అధికారులను సీపీ సన్మానించి, వారి భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, ఎస్ బీ డీసీపీ సుధీంద్ర, హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్ , హెడ్‌క్వార్టర్స్ అడిషనల్ డీసీపీ షమీర్తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper