శ్రీ కనకదుర్గ దేవాలయ ప్రధాన అర్చకులు అనంత ప్రసాద్ శర్మ సంస్మరణ సభలో ఘన నివాళులు
జనం న్యూస్ మే 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి: కూకట్‌పల్లి సుమిత్రా నగర్‌లోని శ్రీ కనకదుర్గ దేవాలయం వద్ద నిర్వహించిన శ్రీ కనకదుర్గ దేవాలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ అడిరాజుపల్లి అనంత ప్రసాద్ శర్మ సంస్మరణ సభ భావోద్వేగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులతో కలిసి అనంత ప్రసాద్ శర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాధవరం రంగారావు మాట్లాడుతూ బ్రహ్మశ్రీ అడిరాజుపల్లి అనంత ప్రసాద్ శర్మ ఆకాల మరణం తనను ఎంతో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారు శ్రీ కనకదుర్గ దేవాలయ అభివృద్ధికి భక్తులతో కలిసి నిరంతరం కృషి చేశారని గుర్తుచేశారు. ఆధ్యాత్మిక సేవలను జీవిత లక్ష్యంగా తీసుకుని అంకితభావంతో పనిచేసిన మహనీయులుగా ఆయనను కొనియాడారు.అలాగే వారి సరళ జీవన విధానం, భక్తి భావం, సనాతన ధర్మ పరిరక్షణకు చేసిన సేవలు సమాజానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. భక్తుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి మానవతా విలువలను చాటిచెప్పిన గొప్ప వ్యక్తిగా అనంత ప్రసాద్ శర్మ చిరస్మరణీయులని అన్నారు.అనంతరం బ్రహ్మశ్రీ అనంత ప్రసాద్ శర్మ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించాలని శ్రీ కనకదుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తూ సభలో పాల్గొన్నవారు నివాళులు అర్పించారు.