కూకట్‌పల్లిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రత్యేక పర్యవేక్షణ

June 27, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ విస్తృతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బాలాజీనగర్ డివిజన్‌లో జరుగుతున్న ఓటరు నమోదు, ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్‌తో కలిసి సర్కిల్ ఉప కమిషనర్ ఆంజనేయులు స్వయంగా పరిశీలించారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు), బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలను అందజేస్తున్నారు. ప్రతి ఓటరు పేరుతో ముద్రించిన రెండు పత్రాల్లో వ్యక్తిగత వివరాలను నమోదు చేసిన అనంతరం ఒక ప్రతిని ఓటరుకు అందజేసి, మరో ప్రతిని అధికారులు సేకరించి కంప్యూటర్‌లో అప్లోడ్ చేయనున్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా, ఖచ్చితత్వంతో జరుగుతోందో లేదో డీసీ ఆంజనేయులు స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో తప్పనిసరిగా నమోదు కావాలని సూచించారు. అదే సమయంలో స్థానికంగా నివసించని వారి పేర్లను గుర్తించి తొలగించే చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నకిలీ లేదా దొంగ ఓట్లు నమోదు కాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటరు నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించిన ఆయన, నిర్లక్ష్యంగా వ్యవహరించే నాయకులపై పార్టీ పరంగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సర్కిల్ ఉప కమిషనర్ ఆంజనేయులు మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తిగా నిబంధనల మేరకు, అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓటు నమోదు, సవరణ లేదా కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారు సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.కార్యక్రమంలో బూత్ నంబర్–219కు బీఎల్‌వో మౌనిక, బీఎల్‌ఏ శ్రీకాంత్ ముదిరాజ్, బూత్ నంబర్–220కు బీఎల్‌వో లక్ష్మీ, బీఎల్‌ఏ ఎండీ జంగీర్ పాల్గొన్నారు. అలాగే బాలాజీనగర్ డివిజన్, వివేక్‌నగర్ కాలనీకి చెందిన పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, బీ-బ్లాక్ అధ్యక్షుడు తూము వేణు, డివిజన్ అధ్యక్షుడు కృష్ణ రాజపుత్, మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి, సునీల్ కుమార్, పిడికిటి గోపాల్ చౌదరి, రంగమోహన్, సుధా తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper