గండ్రవాణిగూడెం గ్రామం లోనికి ఇటుక బట్టీలకు అక్రమ మట్టి తరలింపు
టిప్పర్ల రాకపోకలతో ప్రమాదాలు – దుమ్ము, దూళితో ఉక్కిరిబిక్కిరవుతున్న గ్రామస్తులు
అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
జనం న్యూస్ మార్చ్ 31 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం గండ్రవాణిగూడెం గ్రామనికి అక్రమంగా మట్టిని తరలిస్తున్న వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామ పరిసర ప్రాంతాల నుంచి ఇటుక బట్టీలకు భారీ టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని ప్రధాన రహదారులపై నిత్యం భారీ టిప్పర్లు తిరుగుతుండటంతో రోడ్డు ప్రమాదాల ముప్పు పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు చిన్నపాటి ప్రమాదాలు చోటుచేసుకున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం పట్ల గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.టిప్పర్ల రాకపోకల కారణంగా గ్రామమంతా దుమ్ము, దూళితో నిండిపోతోందని, దీంతో శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు టిప్పర్లు తిరుగుతుండటంతో సాధారణ జీవనం కూడా ఇబ్బందికరంగా మారిందని పేర్కొంటున్నారు.అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాకు సంబంధించి మైనింగ్ శాఖ అనుమతులు లేకుండానే కార్యకలాపాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ కొందరు వ్యక్తులు అధికారుల అండదండలతో యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. మైనింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ జరుగుతున్న ఈ అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, మైనింగ్ శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టి అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాను వెంటనే నిలిపివేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే గ్రామంలో ప్రమాదాలకు కారణమవుతున్న టిప్పర్ల సంచారంపై కఠిన నియంత్రణలు విధించాలని కోరుతున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.