జాతీయ నూనె గింజల మిషన్ పై రైతులకు శిక్షణ కార్యక్రమం
బిచ్కుంద సెప్టెంబర్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని ఫత్లాపూర్ గ్రామంలో జాతీయ నూనె గింజల మిషన్ (National mission on edible oils-oil seeds) NMEO-OS పథకంపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం, రుద్రూర్ శాస్త్రవేత్త డాక్టర్ రాకేష్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం నూనె గింజ పంటల యొక్క ప్రాముఖ్యత, నూనె గింజలను పండించాల్సిన ఆవశ్యకతను రైతులకు వివరించారు. సోయాబీన్, వేరుశనగ, పొద్దు తిరుగుడు, నువ్వులు, కుసుమ మరియు ఆవాలు వంటి నూనె గింజల పంటలను పండించే విధానం, పంట పెట్టుబడి ఖర్చులు, యాజమాన్య పద్ధతులు మరియు దిగుబడుల పెంపుదలకు తీసుకోవలసిన చర్యల గురించి శాస్త్రవేత్త రైతులకు వివరించారు. అనంతరం వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంట యొక్క ప్రాముఖ్యత, ఆయిల్ పామ్ పంటకు ప్రభుత్వం ఇస్తున్న వివిధ రాయితీలు, ఆయిల్ పామ్ పంట పండించే విధానం, యాజమాన్య పద్ధతులు మరియు దీర్ఘకాలంలో ఆయిల్ పామ్ పంట వల్ల రైతులకు కలిగే ఆర్థిక ప్రయోజనాల గురించి రైతులకు క్లుప్తంగా వివరించడం జరిగింది. కార్యక్రమం అనంతరం జాతీయ నూనె గింజల మిషన్ పథకంలో సోయాబీన్ విత్తనాలు వేసిన రైతుల క్షేత్రాల సందర్శన చేసి వారికి సస్యరక్షణ చర్యలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ చెరుకు మరియు వారి పరిశోధన స్థానం రుద్రూర్ శాస్త్రవేత్త డాక్టర్ రాకేష్ గారు, మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, గ్రామ సర్పంచ్ పద్మ మారుతి గారు, ఉప సర్పంచ్ రాజు గారు, వ్యవసాయ విస్తరణ అధికారి మాధవి, బిచ్కుంద రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు, హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ ప్రతినిధులు మరియు రైతులు పాల్గొన్నారు.