పస్తాపూర్ మేస్త్రి కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు – భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించిన భక్తులు

August 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం ఆగస్టు 02. 08. 2026జహీరాబాద్ నియోజకవర్గంలోని పస్తాపూర్ మేస్త్రి కాలనీలో ఆదివారం బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కాలనీవాసులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన ఆడపడుచులు తలపై బోనాలు మోసుకుంటూ భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించడంతో కాలనీ మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మూడో వార్డు కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కాలనీలో ప్రజలందరూ కలిసి పండుగను విజయవంతంగా నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కాలనీవాసులు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, భక్తి గీతాలు, సంప్రదాయ నృత్యాలతో బోనాల వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. పండుగ సందర్భంగా భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. మేస్త్రి కాలనీలో నిర్వహించిన బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘన విజయవంతంగా ముగిశాయి.

🌐 Select Language:
📰 ePaper