బంగారు నగల దొంగతనం కేసులో నిందితుని అరెస్ట్.

June 20, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూన్ 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : ఉప్పలగుప్తం. ఎస్.యానం లోని ఇంట్లో జరిగిన బంగారు నగల దొంగతనం కేసులో నిందితుని పోలీసులు అరెస్టు చేశారు.బంగారు నగల దొంగతనం కేసు కు సంబంధించిన వివరాలను శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ లో డి ఎస్ పి,టి ఎస్ ఆర్ కె ప్రసాద్ రికవరీ చేసిన బంగారు నగలను నిందితుని మీడియా ముందు ప్రవేశపెట్టి వెల్లడించారు. అమలాపురం డి ఎస్ పి ప్రసాద్ కథనం ప్రకారం ఎస్.యానం కు చెందిన చిలుకూరి రాంబాబు తన భార్య అనంతలక్ష్మికి అనారోగ్య సమస్య ఉండడంతో వైద్యం నిమిత్తం 2022 నుండి విశాఖ జిల్లా మధురవాడలో ఇంటిని అద్దెకి తీసుకొని వైద్యం చేయించుకుంటున్నారు. మధురవాడ లో ఉంటున్న ఇంటిలో అనారోగ్యంతో ఉన్న తన భార్య అనంతలక్ష్మికి సహాయకురాలిగా ఉండేందుకు విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బుడతనపల్లి గ్రామానికి చెందిన బోనంగి శాంతి అలియాస్ వర్షిని ని ఇంట్లో పనికి పెట్టుకున్నారు. భార్య ఆరోగ్యం కుదుటపడడంతో మధురవాడలో ఉంటున్న ఇంటిని రాంబాబు ఇటీవల ఖాళీ చేసి తన సొంత గ్రామమైన ఎస్.యానంకు వచ్చేశారు. అయితే ఇంట్లో పని చేస్తున్న శాంతిని కూడా సహాయంగా ఉండేందుకు వారి వెంట ఎస్. యానం తీసుకువచ్చారు. ఇంట్లో మూడు రోజుల ఉన్న శాంతి అనంతరం తన సొంతూరుకు వెళ్ళిపోయింది. శాంతి వెళ్ళిన దగ్గర నుంచి ఇంట్లోని బీరువా తాళాలు కనిపించకపోవడం అలాగే బంగారు ఆభరణాలు అవసరం లేకపోవడంతో చాలా రోజులు బీరువా తాళం పగులగొట్టకుండా ఉండిపోయారు. అయితే శుభకార్యానికి వెళ్లేందుకు బంగారు ఆభరణాలు అవసరం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గత నెల 23న బీరువా తాళం పగులగొట్టి చూడగా అందులోని 18 కాసుల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్టు గుర్తించి శాంతి పైనే అనుమానం వ్యక్తం చేస్తూ రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి శుక్రవారం శాంతిని అదుపులోకి తీసుకొని దొంగతనం చేసిన 18 కాసుల బంగారు నగలను స్వాధీనం చేసుకుని నిందితురాలు శాంతిని అరెస్ట్ చేసి అమలాపురం కోర్టుకు తరలించనున్నట్టు తెలిపారు. బంగారు నగల కేసులో చాకచక్యంగా వ్యవహరించి తక్కువ సమయంలోనే నిందితుని పట్టుకోవడంతో పాటు బంగారు నగల రికవరీ చేసిన అమలాపురం రూరల్ సిఐ,డి. ప్రశాంత్ కుమార్, స్థానిక ఎస్ఐ,ఎస్ కె,జానీ బాషా, హెచ్ సి లు,బివి గిరి(857),కె. హరినాథ్(2606), పిసి లు వి. నాగరాజు(4195),ఎస్ డి.కరీం చంద్(4239), మహిళా కానిస్టేబుల్ ఆర్. కనకదుర్గ (37 69) బృందాన్ని ఈ సందర్భంగా ఎస్ పి రాహుల్ మీనా ప్రత్యేకంగా అభినందించినట్టు డి ఎస్ పి ప్రసాద్ తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper