సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దు: హెడ్ కానిస్టేబుల్ గంగాధర్

September 4, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సెప్టెంబర్ 04: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో శుక్రవారం బస్టాండ్ వద్ద గ్రామ ప్రజలకు హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కల్పించారు. రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.సైబర్ నేరగాళ్లు వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఆర్టీఓ చలాన్ పేరుతో నకిలీ సందేశాలు, లింకులు పంపించి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. అలాంటి లింకులను క్లిక్ చేయడం ద్వారా మొబైల్‌లోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు సైబర్ నేరగాళ్లకు చేరే ప్రమాదం ఉందన్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలు, ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఎవరైనా బ్యాంకు అధికారులు, ప్రభుత్వ అధికారులు, పోలీసుల పేరుతో ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు, ఏటీఎం వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీ అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దని హెచ్చరించారు. అత్యవసరమంటూ ఒత్తిడి చేసినా తొందరపడి డబ్బులు పంపవద్దని, ముందుగా సంబంధిత అధికారులను సంప్రదించి నిజానిజాలు నిర్ధారించుకోవాలని సూచించారు.అలాగే అనుమానాస్పద లింకులు, సందేశాలు లేదా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వాటికి స్పందించకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ కోరారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజల అప్రమత్తతతోనే సైబర్ మోసాలను అరికట్టవచ్చని ఆయన తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper