తెలంగాణ అమరవీరుల త్యాగాలను మరువలేము ఎస్సై పరమేశ్వర్
జనం న్యూస్ జూన్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో ఎస్సై జక్కుల పరమేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం ఎస్సై పరమేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఒక్క రోజులో ఏర్పడలేదని, 1956 నుంచి ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష 1969 జై తెలంగాణ ఉద్యమం, అనంతరం పలు దశల్లో సాగిన ప్రజా పోరాటాలు, విద్యార్థుల ఉద్యమాలు, ఉద్యోగుల సమ్మెలు, వేలాది మంది ప్రజల త్యాగాల ఫలితంగానే 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ఆయన అన్నారు తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, వారి ఆశయాలను సాకారం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర సాధనలో విద్యార్థులు, యువత, ఉద్యోగులు, రైతులు, మహిళలు అందించిన సహకారం చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందని తెలిపారు.అమరవీరుల త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవలో మరింత అంకితభావంతో పనిచేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఐ చార రవీందర్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ కిషన్ రావు శ్రీనివాస్ రెడ్డి కృష్ణమోహన్ కానిస్టేబుల్ సతీష్ రాజు శ్రీశైలం శ్రీనివాస్ ఖలీల్ హోంగార్డ్స్ మంత్రి చందు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు….