బాలాజీ నగర్‌లో SIR ప్రక్రియ కొనసాగుతోంది.. హాస్టళ్లలో ఓటరు ధృవీకరణపై గందరగోళం: బండి రమేష్
జ.నం న్యూస్ జూలై 6 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ డివిజన్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో హాస్టళ్లలో నివసిస్తున్న ఓటర్ల ధృవీకరణ విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ తెలిపారు.సోమవారం కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలతో కలిసి ఏఈఆర్‌ఓ శ్రీనివాస్ సమక్షంలో పలువురు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, ఒకే హాస్టల్‌లో సుమారు 70 మంది వరకు నివసిస్తున్నప్పటికీ వారికి ఓటరు ధృవీకరణ ఫారాలు అందడంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు.హాస్టళ్లలో ఉంటున్న వారికి కూకట్‌పల్లిలో ఓటు హక్కు ఉందా, లేక వారి స్వస్థలాల్లోనే ఓటు నమోదై ఉందా అనే అంశాన్ని పరిశీలించిన అనంతరం బీఎల్‌ఓలు ఫారాలను అందజేస్తున్నట్లు తెలిపారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో సుమారు ఐదు లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారని, ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారని వెల్లడించారు.అదేవిధంగా కూకట్‌పల్లిలో అధిక సంఖ్యలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ సెటిలర్లు తమ ఓటు హక్కును ఇక్కడే కొనసాగిస్తారా, లేక ఆంధ్రప్రదేశ్‌కు మారుస్తారా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదన్నారు. SIR ప్రక్రియ పూర్తయిన అనంతరం నియోజకవర్గంలోని తుది ఓటర్ల సంఖ్యపై స్పష్టమైన అవగాహన వస్తుందని బండి రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తూము వేణు, సతీష్ రెడ్డి, దేశాల్, రాజేష్ గౌడ్, నాగార్జున, మైకేల్, ఫణి కుమార్, నలినీకాంత్, రాజు, రమణ, రవి, గోపాల్ చౌదరి, సంధ్య, రజిత, వనజ, సుజాత, వాణి తదితరులు పాల్గొన్నారు.