రోడ్డు విస్తరణతో రోడ్డున పడుతున్న చిరు వ్యాపారుల బతుకులు జీవనోపాధికి ప్రత్యామ్నాయం కల్పించాలని బండి రమేష్‌ను ఆశ్రయించిన తోపుడు బండ్ల కార్మికులు

September 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సెప్టెంబర్ 3 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : మూసా పేటలో రోడ్డు విస్తరణ పనులు అభివృద్ధికి బాటలు వేస్తున్నప్పటికీ, ఏళ్ల తరబడి అదే ప్రాంతాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల కార్మికుల బతుకులు మాత్రం ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. మూసాపేట డివిజన్‌లోని చిత్తారమ్మ ఆలయం పరిసర ప్రాంతంలో రెండు రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తమ జీవనోపాధికి ఆధారమైన తోపుడు బండ్లను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఆందోళనకు గురైన కార్మికులు, చిరు వ్యాపారులు గురువారం టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. రోడ్డు విస్తరణ కారణంగా తమ ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, తమను నమ్ముకుని ఉన్న కుటుంబాల జీవనం కూడా ఇబ్బందుల్లో పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని, అయితే తమ జీవనోపాధికి భంగం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వ్యాపారులు కోరారు. తమ సమస్యను అధికారులు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయడంతో పాటు, అవసరమైన చోట వ్యాపారాలు కొనసాగించేందుకు అనువైన ప్రత్యామ్నాయ స్థలాలు కల్పించాలని బండి రమేష్‌ను విజ్ఞప్తి చేశారు.వ్యాపారులు, కార్మికుల సమస్యలను బండి రమేష్ సానుకూలంగా విన్నారు. వారి ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సమస్యకు పరిష్కారం చూపేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులతో పాటు పేద, మధ్యతరగతి వర్గాల జీవనోపాధిని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, ఏఎంసీ ఉపాధ్యక్షులు ప్రకాష్ ముదిరాజ్, బాలరాజు, చును పాషా, గోవింద్ గౌడ్, రమణతో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper