అక్టోబర్ 14, 15న హైదరాబాద్ లో సమాఖ్య ఛాంబర్ సదస్సు

August 3, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ ఆగస్టు 3 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) రాజమండ్రి నగరంలో సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ విస్తృత స్థాయి సన్నాహక సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సమాఖ్యలో విశ్వ బలిజ, కాపు, తెలగ, ఒంటరి, తూర్పు కాపు సంఘాలు ఉన్నాయి. కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ్యులు బోండా ఉమ, బండారు సత్యానందరావు, బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బండారు శ్రీనివాస్ తో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కల్వకొలను తాతాజీ, బండి గుప్తాపు రంగా, చవటపల్లి నాగభూషణం, మండేల బాబీ, ఆడ పా దుర్గ బాబు, ఆకుల బుజ్జి, సుంకర స్వామి నాయుడు, ముద్రగడ తాసు, అడపా దుర్గ తదితరులు హాజరయ్యారు. వ్యాపార, పారిశ్రామిక రంగాలపై చర్చించేందుకు అక్టోబర్ 14, 15 తేదీల్లో హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో భారీ అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సదస్సులో 3000 మందికి పైగా వ్యాపార సభ్యులు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొంటారు. వ్యాపారం, పరిశ్రమలకు సంబంధించిన 10 ప్రధాన సెషన్లు, 36 మంది పరిశ్రమ నిపుణులతో 12 ప్రత్యేక సెషన్లు ఉంటాయి. దేశీయ, అంతర్జాతీయ స్థాయి 40 మందికి పైగా నిపుణులు ప్రసంగిస్తారు. అమెరికా, యూకే, యుఎఇ, యూరప్ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో ప్రత్యేక వ్యాపార సమావేశాలు ఉంటాయి. 110 కి పైగా వ్యాపార ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనల కోసం వార్షిక ఈవెంట్ క్యాలెండర్ విడుదల చేస్తారు. ఎంఎస్ఎంఇ మార్గదర్శక కేంద్రం, ప్రైవేట్ ప్లేస్ మెంట్ సలహా కేంద్రం, స్టార్టప్ ఇంక్యుబేటర్ మరియు సమాఖ్య వెంచర్ క్యాపిటల్ ఫండ్ ద్వారా కొత్త పరిశ్రమలకు, స్టార్టప్ లకు తోడ్పాటు అందిస్తారు. మార్కెట్ యాక్సెస్ ప్లాట్ ఫామ్, డేటా మరియు రిసెర్చ్ సెంటర్ వంటి ఆధునిక సేవలు సభ్యులకు అందుబాటులోకి వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో కొత్త పరిశ్రమల స్థాపన, బిజినెస్ నెట్ వర్కింగ్ పెంపు, వ్యాపారవేత్తలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడం సమాఖ్య ప్రధాన లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు.–

🌐 Select Language:
📰 ePaper