రాజమహేంద్రవరంలో సర్వైకల్ క్యాన్సర్ అవగాహన శిబిరంఉచిత ఆరోగ్య పరీక్షలు
జనం న్యూస్ ఆగస్టు 3 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) రాజమహేంద్రవరంమహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణను ప్రోత్సహించడం లక్ష్యంగా వైజ్ఞాన రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంజయ్ దృష్టి టీన్స్ టు క్వీన్స్ కార్యక్రమంలో భాగంగా, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ సహకారంతో ఆదివారం రాజమహేంద్రవరంలోని చెరుకూరి ఫంక్షన్ హాల్ లో ఉచిత సర్వైకల్ క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్ మరియు వైద్య సంప్రదింపుల శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ మండల డిఎస్పి ఎ శివప్రియ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా పి కోమల, వైద్యులు డా వేదమణి, డా లలిత కంబంపాటి, డా వీణా మాధవి, సామాజిక సేవకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాగ్నా హాస్పిటల్ సిఇఓ వల్లూరి వికాస్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ కు చెందిన సుమారు 50 మంది రోటేరియన్లు పాల్గొన్నారు. వారిలో చార్టర్ ప్రెసిడెంట్ తీగెల రాజా, అసిస్టెంట్ గవర్నర్ ఇమ్మాని వెంకట్, క్లబ్ అధ్యక్షుడు తమ్మినీడి లక్ష్మీనారాయణ, కార్యదర్శి శ్యామ్ పొన్నాడ తదితరులు ఉన్నారు. నగర ప్రముఖులు కూడా హాజరై స్వయంగా పాప్ స్మియర్ పరీక్షలు చేయించుకొని మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు మద్దతు తెలిపారు. శిబిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని 400 మందికి పైగా ఆశా కార్యకర్తలు, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, సంహిత డిగ్రీ కళాశాల, ఆదిత్య కళాశాలలకు చెందిన సుమారు 250 మంది విద్యార్థులు అవగాహన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. శిబిరంలో 150 మందికి పైగా పాప్ స్మియర్ పరీక్షలు, 300కు పైగా సిబిసి పరీక్షలు నిర్వహించారు. అదనంగా రాండమ్ బ్లడ్ షుగర్, యుక్తవయస్క బాలికలకు హిమోగ్లోబిన్ పరీక్షలు సహా పలు ఉచిత రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. ఈ కార్యక్రమానికి మాగ్నా హాస్పిటల్, జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్, హీలియోస్ హాస్పిటల్ ప్రధాన సహకారం అందించగా, జిఎస్ఎల్ వైద్య బృందం కూడా పాల్గొని పాప్ స్మియర్ పరీక్షల నిర్వహణలో సేవలందించింది. సర్వైకల్ క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రతి మహిళ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం, హెచ్పివి వ్యాక్సిన్ పై అవగాహన పెంపొందించుకోవడం అత్యంత అవసరమని వైద్య నిపుణులు పేర్కొన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే సందేశంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.