శాంతియుతంగా వినాయక ఉత్సవాలు నిర్వహించాలిమండపాల నిర్వాహకులకు పోలీసుల అవగాహన
జనం న్యూస్ సెప్టెంబర్ 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించాలని బాలానగర్ ఏసీపీ నరేష్‌రెడ్డి, కూకట్‌పల్లి సీఐ డి. స్వామిగౌడ్ సూచించారు. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వినాయక మండపాల నిర్వాహకులు, కమిటీ సభ్యుల కోసం ఎన్‌ఆర్‌సీ గార్డెన్స్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ, వినాయక మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా పోలీసుల అనుమతితో పాటు విద్యుత్ శాఖ అనుమతులు కూడా తీసుకోవాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా నిబంధనలు పాటిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. నిమజ్జనం సమయంలో కూడా పోలీసుల సూచనలు పాటిస్తూ శాంతియుతంగా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరారు.కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్సైలు చంద్రశేఖర్, రవీందర్‌రెడ్డి, తుకారం తదితర పోలీసు అధికారులు మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో వివిధ వినాయక మండపాల నిర్వాహకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసు అధికారులు సూచించిన విధంగానే వినాయక మండపాల వద్ద పూజా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. అధిక శబ్దంతో కూడిన డీజేలను నిర్వహించకుండా, మైకులు, రంగురంగుల విద్యుత్ దీపాలు, బ్యాండు మేళాలతో శాంతియుతంగా ఊరేగింపు నిర్వహించి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తామని స్పష్టం చేశారు.ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని పురేందర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కమిటీ సభ్యులు నందు, రోహిత్, రిత్విక్, నాని, జశ్వంత్, అఖిల్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.