

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 6 రిపోర్టర్ సలికినిడి నాగరాజు రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీలు, రైతు సంఘాల నాయకులు బర్లీ పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు కోరారు. గురువారం సీపీఐ కార్యాలయంలో వివిధ పార్టీలు, రైతు సంఘాల నాయకులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముందుగా పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నల్లమడరైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు మాట్లాడుతూ గత సంవత్సరం పొగాకు పంట ధరలు బాగా ఉండటంతో రైతులు విస్తారంగా బర్లీ పొగాకు సాగు చేశారని, సాగు ఖర్చులు పెరిగినా ధర లభిస్తుందన్న ఆశతో సాగు చేసిన పొగాకు రైతులు ధరలేకపోవడంతో నిండా మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్కెట్ మాయాజాలం వలన ఎందరో రైతులు బలవుతున్నారని వివరించారు. ప్రస్తుతం బర్లీ పొగాకును చురుకుగా కొనటం లేదన్నారు. గత సంవత్సరం మొదటి విరుపు అడుగు ఆకు కొట్టిన తర్వాత అమ్మితే రూ. 8వేల నుంచి రూ. 10వేల వరకు కొన్నారని, ఈ సంవత్సరం రూ. 4-5 వేలకే ధర పరిమితమైందన్నారు. గత సంవత్సరం రెండో వలుపు, మూడో వలుపు పొగాకును రూ. 15వేల నుంచి రూ. 18వేలకు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఈ ఏడాది రూ. 10వేలకు కూడా కొనేనాధుడు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు ధరలు ఇంకా పడిపోతాయని చెబుతున్న వారు, సిగరెట్, బీడీ ధరలు తగ్గలేదన్నారు.ఆయా కంపెనీల లాభాలు తగ్గలేదన్నారు. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం రైతులకు అండగా నిలబడి బర్లీ పొగాకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎఫ్ సి వి వర్జీనియా పొగాకు ధరలను, విస్తీర్ణాన్ని పొగాకు బోర్డు నియంత్రిస్తుందని,. అదేవిధంగా పొగాకు బోర్డు జోక్యం చేసుకొని బర్లీ పొగాకు పంట ధర పడిపోకుండా పొగాకు బోర్డు చూడాలని సూచించారు. కంపెనీల చేత మద్దతు ధరకు బర్లీ పొగాకు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో పొగాకు రైతుల తరుఫున శాంతియుత నిరసనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ఏపీ రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి బాబురావు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం రాధాకృష్ణ, నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రమణ్యం, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుభాని, జనక్రాంతి పార్టీ అధ్యక్షుడు షేక్ గౌస్, రైతు సంఘం నాయకులు కోలా నవజ్యోతి, ,చండ్రా కొండలరావు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కె కోటేశ్వరరావు, కారుచోల స్వప్నకుమార్, ఉప్పాలబాబు, ఆర్ నర్సిరెడ్డి, ఇంటూరి భవాని వెంకటేష్, రైతు సంఘ నాయకులు షేక్ సత్తార్, షేక్ సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు.